South Indian Cinema: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా పాన్ ఇండియా మంత్రమే నడుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ నే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. ఎందుకు సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి ? అసలు దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా కూడా మన సౌత్ చిత్రాల పై ఎందుకు ఆసక్తి పెరుగుతోంది? చాలా కారణాలు ఉన్నాయి. మరెన్నో వివరణలు ఉన్నాయి.
ఎన్ని ఉన్నా.. వాస్తవం ఒక్కటే. 2015లో రిలీజ్ అయిన ‘బాహుబలి-ది బిగినింగ్’ సినిమానే పాన్ ఇండియాకి బలమైన పునాది వేసిందనేది నిజం. అయితే, ఆ పునాదికి కాస్త బలం చేకూర్చిన సినిమా ‘కేజీఎఫ్-చాప్టర్1’. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే సౌత్ సినిమాల పై అందరి చూపు పడింది.
అయితే, సౌత్ సినిమాలకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన ఘనత మాత్రం కచ్చితంగా ఓటీటీ వేదికలదే. సౌత్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఆదరణ, ఆదాయం భారీగా అందడానికి ముఖ్య కారణం ఓటీటీనే. అందుకు నిదర్శనమే ఇది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువగా వెదుకుతున్న సినిమాలు సౌత్ సినిమాలే.
గతేడాది నవంబర్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ దేశంలోనే ఎక్కువ మంది వెతికిన సినిమా ఏదో తెలుసా ? సూర్య నటించిన ‘సురారై పొట్రు’ సినిమానే. ఈ సౌత్ సినిమాకి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో 100 పాయింట్లు వస్తే.. అదే సమయంలో రిలీజ్ అయిన హిందీ సినిమాలు అయినా ‘చల్లాంగ్’కు 17 పాయింట్లు , అలాగే మరో హిందీ సినిమా ‘లూడో’కి 50 పాయింట్లు వచ్చాయి.
ఈ లెక్కలు చాలు సౌత్ సినిమాలు భారత సినీ ప్రపంచంలో ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. ఒక్కసారిగా సౌత్ చిత్రాలకు ఆదరణ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇంటర్నెట్.. గతంతో పోల్చుకుంటే.. గత రెండేళ్లలో సౌత్ ప్రేక్షకులు నెట్ వాడకం రెట్టింపు అయింది.
అలాగే సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్ కు కూడా నార్త్ లో భారీ క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఒకప్పుడు సౌత్ సినిమా హిందీలోకి వెళ్ళాలి అంటే ఉన్న ఏకైక మార్గం శాటిలైట్. కానీ, ఓటీటీలు వచ్చాక, యూట్యూబ్ వైభవం పెరిగాక, సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ హిందీ ప్రేక్షకులకు చాలా ఈజీగా చేరువ అవుతున్నాయి.
ఆ సినిమాలు చూసిన హిందీ ప్రేక్షకులు సౌత్ స్టార్స్ ను అభిమానిస్తున్నారు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో మన హీరోలకు నార్త్ వాళ్ళు అభిమానులు అవుతున్నారు.