
‘మోహిని’ నిన్నటి తరం హీరోయిన్. ముఖ్యంగా ‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్ నారద’ వంటి సినిమాల్లో ఆమె నటన అమోహం అన్నారు. తన హోమ్లీ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహిని తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె వివరంగా చెప్పుకొచ్చింది. మోహిని గురువు రమణ మహర్షికి వరసకు మనవరాలు అవుతుందట.
అయితే, ప్రస్తుతం ఆమె క్రైస్తవ మతాభిమాని. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని ఎందుకు క్రైస్తవ మతంలోకి మారారు ? అంటే.. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. చిన్న తనంలో నేను మడి ఆచారాలను కూడా పాటించాను. అయితే, నా జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి.
అప్పటికే, నాకు పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ సమస్యలకు పరిష్కారం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో క్రీస్తు నాకు మార్గం చూపించారు. అప్పటి నుండే నాకు క్రైస్తవ మతం పై నమ్మకం పెరిగింది. ప్రస్తుతం నేను ఒక చర్చి నిర్మాణంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నాను. ఇక రమణ మహర్షి, మా తాతగారికి కజిన్ బ్రదర్ అవుతారు. అలా రమణ మహర్షితో నాకు సన్నిహిత సంబంధం ఉంది.
ఇక నా అసలు పేరు చాలా మందికి తెలియదు. మా అమ్మానాన్న నాకు పెట్టిన పేరు ‘తంజావూరు మహాలక్ష్మి’. నా సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది అంటే..
మాది శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం. నాన్నగారు మద్రాసు హార్స్‌రేస్ క్లబ్‌లో సెక్రటరీగా పని చేసేవారు. నేను నాట్యం కూడా నేర్చుకున్నాను. నా డ్యాన్స్ ఫొటోలను ప్రముఖ నిర్మాత పంజు అరుణాచలం చూసి నన్ను నటించమని అడిగారు. నేను ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించాను.