Japan Teaser Review : ఈ మధ్య హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసి విజయాలు సాధిస్తున్నారు. సాహోలో ప్రభాస్, పుష్పలో అల్లు అర్జున్ క్రిమినల్స్ గా కనిపించారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజ ఒకప్పటి స్టూవర్టుపురం దొంగ రోల్ చేస్తున్నాడు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. హీరో కార్తీ సైతం దొంగ అవతారం ఎత్తాడు. ఆయన లేటెస్ట్ మూవీ జపాన్. ఈ చిత్రంలో ఆయన క్రేజీ దొంగ పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీ విడుదల సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు.
నేడు జపాన్ టీజర్ విడుదల చేయడమైంది. నిమిషానికి పైగా నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కార్తీ లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. ఉంగరాల జుట్టు, గోల్డ్ కలర్ డ్రెస్, జ్యూవెలరీ ధరించి భిన్నంగా కనిపిస్తున్నాడు. జపాన్ మూవీలో కార్తీ గజదొంగ రోల్ చేస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. మోస్ట్ వాంటెడ్ థీఫ్ గా పేరుగాంచిన జపాన్… ఓ నగల దుకాణంలో రూ. 200 కోట్ల విలువ చేసే బంగారం కొట్టేస్తాడు.
ఈ కేసు చేధించాలని పోలీసుల మీద ప్రభుత్వం నుండి ఒత్తిడి పెరుగుతుంది. సునీల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కోట్లు కొల్లగొట్టిన జపాన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. జపాన్ దొంగ కావడం వెనుక నేపథ్యం ఏమిటనేది ట్విస్ట్. టీజర్లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అందించిన బీజీఎమ్ బాగుంది. ఇక జపాన్ మూవీలో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తుంది.
జపాన్ చిత్రానికి రాజు మురుగన్ దర్శకుడు. డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తీకి జపాన్ మంచి విజయం కట్టబెట్టే సూచనలు కలవు. ఆయన గత చిత్రం సర్దార్ హిట్ కొట్టింది. తెలుగులో ఓ మోస్తరు విజయం సాధించిన ఈ మూవీ తమిళంలో విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక జపాన్ దీపావళి కానుకగా థియేటర్స్ లో దిగనుంది. హిట్ లేక ఇబ్బంది పడుతున్న అను ఇమ్మానియేల్ జపాన్ మీదే ఆశలు పెట్టుకుంది.