Hari Hara Veeramallu : సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జనవరి నెల తర్వాత మన టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమా లేదు, చిన్న సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి కానీ, అవి కేవలం వీకెండ్ కి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇండస్ట్రీ బాగుపడాలన్నా,థియేటర్స్ బ్రతకాలన్నా పెద్ద హీరో సినిమా విడుదల అవ్వడం, అది సూపర్ హిట్ కావడం తప్పనిసరి. అందుకే ట్రేడ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందా లేదా అనేది మరో 5 రోజుల్లో తేలనుంది.
ఇది కాసేపు పక్కన పెడితే నేడు ఈ చిత్ర నిర్మాత AM రత్నం పలువురు ముఖ్యమైన మీడియా ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించాడు. ఈ సమావేశం లో ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా సోమవారం, అనగా జులై 23న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నాడు. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి వారు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారిని అతిథిగా పిలవాలని కోరుకోలేదా అని నిర్మాత రత్నం ని అడగ్గా, కుటుంబ సభ్యులను పిలవకూడదు అనే సిద్ధాంతం ని పెట్టుకున్నాం కాబట్టి పిలవలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, మెగా అభిమానులు కూడా, చిరంజీవి ఈ ఈవెంట్ కి వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి ఏ సినిమా గురించి అయినా నిండు మనస్సుతో మనస్ఫూర్తిగా మాట్లాడుతాడు.
ఆయన మాటలు సినిమా మీద అంచనాలు పెంచేవిధంగా ఉంటాయి. దానికి తోడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి ఉపముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఎమోషనల్ సంఘటనలు జరిగాయి. వాటి గురించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి నోటి నుండి వస్తే వినాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే చిరంజీవి ఈవెంట్ రావట్లేదని కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ నుండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ , తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరియు కర్ణాటక ప్రాంతం నుండి పలువురు మంత్రులు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. శిల్ప కళావేదిక లో సోమవారం సాయంత్రం నుండి ఈ ఈవెంట్ జరగబోతుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు. అభిమానుల ఉత్సాహం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.