Naga Babu: జబర్దస్త్ జడ్జి బాధ్యతలు వదిలేశాక నాగబాబు బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ లెజెండరీ కామెడీ షోలో దాదాపు ఏడేళ్లు ఆయన పని చేశారు. జబర్దస్త్ నిర్వాహకులపై విమర్శలు గుప్పించి బయటికొచ్చిన నాగబాబు… అదిరింది అంటూ పోటీగా జీ తెలుగులో కామెడీ షో స్టార్ట్ చేశాడు. అది సక్సెస్ కాలేదు. తర్వాత యూట్యూబ్ లో ప్రయోగాత్మకంగా స్టాండప్ కామెడీ షోలు నిర్మించారు. వాటికి కూడా ఆదరణ అంతంత మాత్రమే. దీంతో స్టార్ మా లో కొన్నాళ్లుగా నడుస్తున్న కామెడీ స్టార్స్ అనే షోకి జడ్జిగా వచ్చారు. ఇతర ఛానల్స్ లో స్వయంగా జబర్దస్త్ మాజీ కమెడియన్స్ స్కిట్స్ చేసినా ఫలితం ఇవ్వడం లేదు. కామెడీ స్టార్స్ సైతం ఆగిపోయినట్లు సమాచారం.
జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన గెటప్ శ్రీను, హైపర్ ఆది తిరిగి రావడంతో మరలా పుంజుకుంటుంది. ఇక చేతిలో షోలు లేని నాగబాబు ఖాళీగా ఉంటున్నారు. అయితే ఆయన పొలిటికల్ గా బిజీ అయ్యారు. జనసేన(Janasena) పార్టీలో నాగబాబు కొన్నాళ్లుగా క్రియాశీలకంగా ఉంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి జనసేన పార్టీని ఏపీ రాజకీయాల్లో నిర్ణయాత్మక స్థితికి తీసుకెళ్లాలని కృషి చేస్తున్నారు.
నాగబాబు(Nagababu) జనసేన కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నారు. ప్రతినెలా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కారణం తెలియదు కానీ ఆయన చేతికి గాయమైంది. కుడి చేతికి ఆయన సపోర్ట్ తో కనిపిస్తున్నారు. నాగబాబు కుడి చేతికి ఏమైందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. ఇటీవల వరుణ్ తేజ్ 13వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో కూడా నాగబాబు చేతికి సపోర్టింగ్ బెల్ట్ తో కనిపించారు.
కాగా కూతురు నిహారిక తన చేతికి అవసరమైన వ్యాయామం చేయిస్తుంది. ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన నాగబాబు ”ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో. మీరు ఇంటి వద్ద దీని ట్రై చేయవద్దు. ఇది డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో చేసింది” అంటూ కామెంట్ పెట్టాడు. నొప్పి పోవాలంటే నొప్పి కలిగించే వ్యాయామం తప్పనిసరి అని అర్థం వచ్చేలా నాగబాబు ఆ కామెంట్ చేశారు. కాగా అక్టోబర్ 5 నుంచి పవన్(Pawan Kalyan) చేపట్టాల్సిన బస్సు యాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రజాసమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసమే వాయిదా అంటూ పవన్ తెలియజేశారు. నియోజకవర్గాల్లో పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న కార్యకర్తలను ఈ నిర్ణయం ఒకింత నిరాశపరిచింది.