Ravi Babu: ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడే తత్త్వం సినీ ఇండస్ట్రీ లో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదురు అవుతాయనే భయం కొంతమందికి ఉంటుంది. కానీ చిన్న సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా , ఎలాంటి భయం బెరుకు లేకుండా మనసులో ఉన్న మాటలను మాట్లాడే ధైర్యం ఉన్న అతి కొద్దిమంది సినీ సెలబ్రిటీలలో ఒకరు రవి బాబు. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ , టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు ఆయన. కాస్త గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ , హీరోగా నటించిన చిత్రం ‘రేజర్’. ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు.
అందులో భాగంగా ఆయన వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ ఉన్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై పలు హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘మేము ముందుగా మా రేజర్ చిత్రాన్ని మే 1 న విడుదల చేద్దామని అనుకున్నాము. కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం ఉండడంతో , ట్రేడ్ ఫోకస్ మొత్తం ఆ సినిమా మీదనే ఉంటుంది, మా లాంటి చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు, కలెక్షన్స్ రావు అని సన్నిహితులు భయపెట్టారు. అందుకే ఈ చిత్రాన్ని మే 8 కి వాయిదా వేశాము, కానీ ఇప్పుడు పెద్ది చిత్రం రాలేదు , దీని వల్ల మంచి విడుదల తేదీని మేము కోల్పోయినట్టు అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పెద్ద సినిమాలన్నీ ఇలాగే ఉన్నాయి. ముందుగా ఒక డేట్ ప్రకటిస్తారు , కానీ ఆ డేట్ కి సినిమాని విడుదల చెయ్యరు. ఈ పెద్ద సినిమాల కారణంగా చిన్న సినిమాలు అటు ఇటు పరుగులు తీయాల్సి వస్తోంది. పెద్ది చిత్రం కారణంగా ఒక 15 రోజుల పాటు నేను నరకం అనుభవించాను. పెద్ద చిత్రాలు ఇలా వాయిదా పడడం వల్ల, చిన్న సినిమాలు తీసే మాపై పబ్లిసిటీ ఖర్చులు వృధా అవుతోంది. ఇది చిన్న సినిమాలకు చాలా బరువైన అంశం’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు. మే 8 న రవిబాబు తండ్రి , ప్రముఖ నటుడు చలపతిరావు పుట్టినరోజు, ఆ రోజున తన సినిమాని విడుదల చెయ్యాలని విధి నిర్ణయించినట్టు ఉంది , అందుకే ఇలా అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు.