Kalvakuntla Kavitha: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారా.. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కదా.. మళ్లీ ఆయన ఆ పార్టీలోకి వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. కానీ టిఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ది కాదు.. కెసిఆర్ ఆల్రెడీ ఆ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దేశంలో చక్రాలు తిప్పడానికి ఆయన అప్పట్లో అనేక రకాలుగా అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. దేశంలో గత్తర లేపడానికి సిద్ధమయ్యారు. కానీ అది అంత ఈజీ కాలేదు.
చివరికి కేసీఆర్ నాటి ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి ఓడిపోయారు. ఆయన పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూసింది. ఒక స్థానంలో కూడా విజయం సాధించకుండా పరువు తీసుకుంది.. అయినప్పటికీ సోషల్ మీడియాలోనే ఆ పార్టీ మాత్రమే బలంగా ఉంది. కేటీఆర్, హరీష్ రావు వంటి వారు సోషల్ మీడియాలో.. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఆశాజనకంగా లేవు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్ల తర్వాత గులాబీ పార్టీకి కవిత రూపంలో ఉపద్రవం వచ్చింది. ఆమె పార్టీ లో తన స్థానం గురించి అడిగినందుకు.. ఏకంగా ఆమెను బయటికి పంపించారు. దీంతో ఆమె తెలంగాణ రక్షణ సేన పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లపాటు కేసీఆర్ కు పేటెంట్ రైట్ లాగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఆమె లాక్కున్నారు. దీనిపై గులాబీ పార్టీ నేతలు కోర్టు దాకా వెళ్లారు. చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. ఏం చేసినా సరే తెలంగాణ రక్షణ సేన అలియాస్ టిఆర్ఎస్ పేరు కవిత దగ్గర మాత్రమే ఉండేలా కనిపిస్తోంది.
కవిత కూడా టిఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఓపెన్ గానే మాట్లాడారు. ముఖ్యంగా టిఆర్ఎస్ విషయంలో క్లారిటీగా చెప్పేశారు. తాను భారత రాష్ట్ర సమితిలోకి వెళ్ళేది లేదని.. జీవితానికి సరిపడా అవమానాలు ఆ పార్టీలో తనకు ఎదురయ్యాయని.. ఒకవేళ కెసిఆర్ భారత రాష్ట్ర సమితి నుంచి టిఆర్ఎస్ లోకి వస్తానని చెబితే కచ్చితంగా సాదరంగా ఆహ్వానం పలుకుతామని కవిత అన్నారు. టిఆర్ఎస్ పార్టీ పేరును పోగొట్టుకునే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి తన తండ్రి కంటే తాను జగ మొండి అని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి ఈ కుటుంబం మధ్య టిఆర్ఎస్ పేటెంట్ వ్యవహారం ఏ స్థాయిలో మంట పెడుతుందో చూడాల్సి ఉంది.
