Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి , ఆయన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన ఇచ్చిన కిక్ మామూలుది కాదు. డీసెంట్ స్థాయి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆరోజుల్లో వసూళ్ళ సునామీ సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అంతే కాదు , ఈ సినిమా ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అప్పటి వరకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ ఐరన్ లెగ్ గా పేరొందిన శృతి హాసన్ కెరీర్ మారిపోయింది. అదే విధంగా నిర్మాతగా బండ్ల గణేష్ ని ఇండస్ట్రీ లో స్థిరపడేలా చేసింది. ఇక ఈ చిత్రం లోని అంత్యాక్షరి సన్నివేశం ఏ రేంజ్ లో పేలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ అంత్యాక్షరి సన్నివేశం లో నటించిన రౌడీ గ్యాంగ్ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సన్నివేశంతో వచ్చిన ఫేమ్ తో ఇప్పటికీ ఈ గ్యాంగ్ కి సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ గ్యాంగ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఫిష్ వెంకట్ మరణించడం ఆరోజుల్లో ఎంతటి తీవ్రమైన విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాంగ్ లోని మరో నటుడు రమేష్ ఆరోగ్య పరిస్థితి కూడా తీవ్రస్థాయిలో విషమించింది. అంత్యాక్షరి సన్నివేశం లో ఆర్ నారాయణ మూర్తి ని అనుకరించే వ్యక్తి గుర్తున్నారు కదా, అతనే ఈ రమేష్. హఠాత్తుగా ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబం సభ్యులు వెంటనే ఇతన్ని హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. న్యూరాలజిస్టులతో పాటు ప్రత్యేక వైద్య బృందాన్ని ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్లు చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ హాస్పిటల్ కి చేరుకొని రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ కి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడతానని మాట ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు రమేష్ ని ఆదుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి వేడుకుంటున్నారు. ఎందుకంటే రమేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ వెనుక ఎవరు ఉన్నా, లేకపోయినా ఈ గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రతీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం చేస్తూ , ఆ పార్టీ కి ఓట్లు రప్పించడం కోసం చాలా కష్టపడ్డారు. అలాంటి విధేయుల్లో ఒకరైన రమేష్ ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పవన్ వరకు ఈ విషయం చేరుతుందో లేదో చూడాలి. ఇకపోతే రమేష్ కి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

