
కరోనా ఎఫెక్ట్ దేశ ఆర్ధిక వ్యవస్థని తీవ్ర ఇబ్బందుల్లో పడేయబోతోంది కరోనా లాక్ డౌన్ ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా ప్రభావం చూపుతుందో తెలియదు కాని సినిమా ఇండస్ట్రీపై మాత్రం వెంటనే పడింది. ఒక పక్క థియేటర్లు బంద్.. మరో పక్క సినిమా నిర్మాణాలు ఆగిపోయాయి.. షూటింగ్స్ లేక లక్షలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అదే టైం లో విడుదల అవ్వాల్సిన చాలా సినిమాలు ల్యాబ్ లో మూలుగుతున్నాయి. త్వరలో లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవని సినీ విశ్లేషకులు అంటున్నారు.
మార్చ్15 న మూత పడిన సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. ఒకవేళ ఏ రెండు నెలల తరవాతో ఓపెన్ అయితే ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఒక్కసారే థియేటర్ల మీద పడే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఎవరి చేతిలో సినిమా థియేటర్లు ఉన్నాయో ఆ నిర్మాతల సినిమాలు మాత్రమే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది .ఆ పరిణామం చిన్న సినిమాలకు ఆత్మహత్యా సదృశ్యం..
టాలీవుడ్ సినిమాల విడుదలకే కష్టాలు పడే ఆ సమయం మరో పక్క డబ్బింగ్ సినిమాలు కూడా ఇబ్బంది పెడతాయి.. కానీ ఇప్పటి పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలు విడుదల అవ్వడం కష్టం. ఒకవేళ విడుదల అయినా కూడా ఎక్కువ థియేటర్లు దొరక్కపోవచ్చు .మొత్తానికి లాక్ డౌన్ పూర్తి అయినా కూడా టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం అంత సులభంగా ఒక కొలిక్కి వచ్చేలా లేదు .