False news about Chiranjeevi health: సెలబ్రిటీల పేర్లను వాడుకొని డబ్బులు సంపాదించడం తప్పేమి కాదు, కానీ ఎవరి పేరుని అయితే వాడుకొని డబ్బులు సంపాదిస్తున్నారో, వాళ్ళ ప్రతిష్ట కి , పరువుకు భంగం కలిగిస్తూ డబ్బులు సంపాదించడం అనేది అత్యంత నీచమైన చర్య. అలా సంపాదించిన డబ్బులతో అన్నం తినలేము , కుటుంబాన్ని పోషించలేము. కానీ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో కొన్ని యూట్యూబ్ చానెల్స్ ని చూస్తే రక్తం మరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రచారం చేసేది ఒక్కటి కూడా నిజం ఉండదు. ఎల్లప్పుడూ అసత్యాలే ప్రచారం చేస్తుంటారు. చివరికి ఆరోగ్యం పైన కూడా అత్యంత నీచమైన ప్రచారాలు చేస్తుంటారు. అలా ఈమధ్య కాలంలో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ పదే పదే మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై అభిమానుల్లో లేనిపోని అనుమానాలు సృష్టిస్తూ , వాళ్ళను భయబ్రాంతులకు గురి చేస్తూ వస్తోంది.
దీనిపై మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పలుమార్లు సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను హెచ్చరించారు. కానీ తీరు లో ఎలాంటి మార్పు లేకపోవడం తో , హైదరాబాద్ లోని కమలాపురి కాలనీ కి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల సోమవారం రోజున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆ యూట్యూబ్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యపరిస్థితి పై చేసిన వీడియోలకు సంబంధించిన లింకులు, స్క్రీన్ షాట్స్ వంటివి పోలీసులకు ఆధారాలుగా ఇచ్చారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో ఇలా ఆరోగ్యం పట్ల, మరియు ఇతర విషయాల పట్ల అసత్య ఆరోపణలు చేయడం చట్ట రీత్యా నేరమని , శిక్షార్హులని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు ని తీసుకున్న పోలీసులు, కోర్టు అనుమతితో సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇలాంటి యూట్యూబ్ చానెల్స్ ని తక్షణమే బ్యాన్ చెయ్యాలని , మరో సెలబ్రిటీకి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా చెయ్యాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
