Dragon : డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఇప్పుడు హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఇతను తమిళ హీరో జయం రవి నటించిన ‘కోమలి’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన డైరెక్టర్ గా, అదే విధంగా హీరో గా మారి ‘లవ్ టుడే’ అనే సినిమా చేశాడు. కమర్షియల్ గా ఈ చిత్రం ఒక సెన్సేషన్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిల్చి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన రెండవ చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie) కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమాకి, ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. త్వరలోనే ఈ చిత్రం 150 కోట్ల రూపాయిల మార్కుని కూడా అందుకోనుంది. మార్చి 14 న హోలీ సందర్భంగా ఈ చిత్రం హిందీ లో కూడా గ్రాండ్ గా విడుదల కానుంది. పొరపాటున హిందీ లో హిట్ అయితే మాత్రం మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ సినిమా ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ నయనతార(Nayanathara) నిర్మాతగా, ఆమె భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న LIC అనే చిత్రం లో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లో త్వరలోనే ప్రదీప్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం లో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ప్రేమలు ఫేమ్ మమిత బైజు(Mamitha Baiju) ఒక హీరోయిన్ గా ఖరారు అయ్యింది. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ని కూడా మంచి క్రేజ్ ఉన్న వాళ్లనే తీసుకోబోతున్నారట. ఈ సినిమాకి స్వయంగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. మొదటి రెండు సినిమాలు లాగానే, ఈ చిత్రం కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది అట. ఈ సినిమాతో పాటు ఆయనకు ఇటు టాలీవుడ్ నుండి, అటు కోలీవుడ్ నుండి వరుసగా అవకాశాలు క్యూలు కడుతున్నాయట. కానీ ప్రదీప్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ ఉన్న ఫామ్ కి, ఇంకో సూపర్ హిట్ పడితే తమిళనాడు యూత్ ఐకాన్ గా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.