Hero Srikanth Brother : మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పూర్తితో, సినిమాల మీద విపరీతమైన పిచ్చితో, చిరంజీవి లాగా పెద్ద హీరోలు అవుదాం అనే ఆశతో ఎంతోమంది ఇండస్ట్రీ లోకి వస్తారు. కానీ కేవలం ఆశ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు టాలెంట్, పట్టుదల, కృషి తో పాటు బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. అసలు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడమే ఒక అదృష్టం, సినిమాల్లో అవకాశాల కోసం అన్ని వదులుకొని ఇప్పటికీ కృష్ణ నగర్ లో ఎన్ని వేల మంది అవకాశాలు దొరకక కష్టాలు పడుతూనే ఉన్నారు. అలాంటి కష్టాల్లో నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోనే శ్రీకాంత్. చూసేందుకు ఎర్రగా, బుర్రగా ఉండే శ్రీకాంత్ ని చూడగానే ఎవరికైనా అతన్ని పెట్టి హీరో గా సినిమాలు తియ్యాలని అనిపిస్తాది.
కానీ శ్రీకాంత్ కి కెరీర్ ప్రారంభం లో అలా జరగలేదు. మొదట్లో ఆయనని దర్శక నిర్మాతలు విలన్ రోల్స్ లోనే ఎక్కువగా చూపించేవారు. ఆ తర్వాత ఆయనలోని టాలెంట్ ని గుర్తించి హీరో అవకాశాలు ఇచ్చారు. అలా తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అనతి కాలం లోనే స్టార్ గా ఎదిగాడు. అప్పట్లో శ్రీకాంత్ అంటే యూత్ ఆడియన్స్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా అమ్మాయిలు ఈయన సినిమా విడుదలైతే క్యూలు కట్టేస్తారు. అలాంటి క్రేజ్ ని శ్రీకాంత్ అతి తక్కువ సమయంలోనే అందుకున్నాడు. అదే సమయంలో ఆయనకీ ఫ్లాప్స్ కూడా వచ్చాయి, ఒకానొక దశలో ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాడు. కానీ చిరంజీవి ప్రత్యేకంగా పిలిచి శ్రీకాంత్ కి జ్ఞానబోధ చెయ్యడంతో ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్యారక్టర్ రోల్స్ చేసే దాకా వచ్చాడు. ఇదంతా పక్కన పెడితే శ్రీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహం తో ఆయన తమ్ముడు అనిల్ కుమార్ కూడా ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టాడు. ఈయన ‘ప్రేమించేయి ఎందుకమ్మా’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.
ఇందులో శ్రీదేవి కజిన్ మహేశ్వరీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రాంతి కుమార్ నిర్మాతగా వ్యవహరించగా, లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందించాడు. జాన్ మహేంద్రన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. 1999 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, కనీసం ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. అనిల్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత నిర్మాతగా కొన్ని సినిమాలు చేసాడు కానీ, అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో సినీ రంగాన్ని వదిలి ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతనికి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకప్పుడు శ్రీకాంత్ కంటే అందంగా ఉండే ఆయన ఇప్పుడు ఇలా తయారయ్యాడు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.
