Savitri: తెలుగు అమ్మాయి సావిత్రి నటిగా ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది. పురుషాధిక్యతతో కూడిన పరిశ్రమలో ఆమె స్టార్ హీరోలను డామినేట్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సమానమైన స్టార్డం సావిత్రి అనుభవించారు. ఒక దశలో వారి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ సావిత్రి తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఆల్ టైం క్లాసిక్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
నటనకు చిరునామాగా సావిత్రిని జనాలు చెప్పుకుంటారు. సావిత్రి సినిమాలో ఉంటే చాలని దర్శక, నిర్మాతలు భావించారు. ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవారు. కీర్తితో పాటు సావిత్రి అంతులేని సంపద కూడబెట్టారు. అయితే సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు, నమ్మినవాళ్లు చేసిన మోసాలు కారణంగా.. సర్వం కోల్పోయారు. చివరి రోజుల్లో సావిత్రి దుర్భర జీవితం అనుభవించారు. దాదాపు ఏకంగా 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26న కన్నుమూసింది .
కాగా సావిత్రి అంత్యక్రియలకు టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు సైతం హాజరయ్యారు. అయితే నందమూరి తారక రామారావు వెళ్ళలేదు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు. ఈ కారణంగా సావిత్రి అంత్యక్రియలకు వెళ్ళలేదు. అయితే తన తరపున ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను పంపారు.
ఆ విధంగా ఈ తరం హీరోల్లో బాలకృష్ణ మాత్రమే సావిత్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కాగా చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చేసిన ఒకటి రెండు చిత్రాల్లో సావిత్రి నటించారు. అప్పటికి సావిత్రికి పెద్దగా స్టార్డం లేదు. సావిత్రితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం చిరంజీవికి దక్కింది. కానీ చిరంజీవి బిజీ షెడ్యూల్స్ వలన సావిత్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదు.
సావిత్రి జీవిత కథను దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి టైటిల్ తో తెరకెక్కించారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన మహానటి తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ మహానటి చిత్రంలో భాగమయ్యారు.