Homeఎంటర్టైన్మెంట్Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్.. నిర్మాతల పాలిట బంగారం

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్.. నిర్మాతల పాలిట బంగారం

Lokesh Kanagaraj: వెనుకటి రోజుల్లో నిర్మాత అంటే అందరికీ భయం ఉండేది. చివరికి దర్శకుడు కూడా వణికి పోయేవాడు. అందుకే నిర్ణీత సమయంలోనే సినిమా పూర్తయ్యేది. సినిమా హిట్ అయినా దర్శకుడికి గాని, హీరోలకు గాని ప్రత్యేక వాటాలు అంటూ ఉండేవి కావు. ఒక రకంగా వాటిని సినిమాల తాలూకూ స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం జరుగుతుండేది కాబట్టి అందరికీ సమానమైన గౌరవం దక్కేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.. నిర్మాత అంటే జస్ట్ చెక్కులు ఇచ్చేవాడు. ఇక నిర్ణీత సమయం వరకు సినిమా షూటింగ్ పూర్తి అయితే అదే అతడికి పది వేలు. హీరోల తల దురుసుతనం, దర్శకుల అతి తెలివి, హీరోయిన్ల మెయింటెనెన్స్.. వెరసి నిర్మాత విలువను తగ్గించాయి. కేవలం ఒక ఫైనాన్షియర్ పాత్రకు పరిమితం చేశాయి. చివరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా నిర్మాతకు గౌరవం దక్కడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి విపత్కర రోజుల్లో కూడా నిర్మాతకు గౌరవం ఇచ్చి, అతడికి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసే ఒక దర్శకుడు ఉన్నాడు. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో మీరూ చదివేయండి.

కోయంత్తూరు బంగారం

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు పేరు ప్రస్తావనకు వస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి ఆటోమొబైల్ పరిశ్రమ. ఇండియన్ జర్మనీ గా ఆ ప్రాంతం పేరుపొందింది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే లోకేష్ కనగరాజ్. చేసింది ఇప్పటివరకు నాలుగంటే నాలుగే సినిమాలు. కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. తన పేరిట ఒక సినిమా యూనివర్స్ కూడా నెలకొల్పాడు. అంతటితోనే కాదు నిర్మాతల పాలిట బంగారంగా పేరుపొందాడు. కేవలం తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసే దర్శకుడిగా తన పేరిట రికార్డు సృష్టించుకున్నాడు. అంతేకాదు విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ ఏమాత్రం హిప్పోక్రసీకి తావివ్వలేదు. పైగా తను మాటిచ్చిన నిర్మాణ సంస్థకు ఒక సినిమా చేసి ఇచ్చాడు. అది కూడా ఆ అతి తక్కువ రోజుల్లో. సినిమా పేరే లియో. అందులో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరో.

తక్కువ రోజుల్లో..

వాస్తవానికి సినిమా నిర్మాణం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఇక సినిమా పరిశ్రమలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు దర్శకుల తలలకు కొమ్ములు మొలుస్తాయి. క్రియేటివిటీ పేరుతో ఏళ్ళకు ఏళ్ళు సినిమా నిర్మాణం చేస్తారు. దీనివల్ల నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతారు. అటు దర్శకులను కూడా ఏమీ అనలేని పరిస్థితి. దీనికి తోడు హీరోలు, హీరోయిన్లు. ఈ పరిస్థితి నెలకొన్న పరిశ్రమలో లోకేష్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతడు ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీశాడు. ఐదవ సినిమా కూడా నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇవన్నీ కూడా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయడం విశేషం. మా నగరం అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మా నగరం అనే సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా రూపొందిన “ఖైదీ” సినిమా షూటింగ్ ను 62 రాత్రుల్లో పూర్తి చేయడం విశేషం. సినిమా సూపర్ హిట్ అయిన విజయ్ హీరోగా మాస్టర్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా కూడా కేవలం 129 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్లో విక్రం అనే సినిమా తీశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కేవలం 110 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తమిళ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత మళ్లీ విజయ్ హీరోగా లియో అనే సినిమాను లోకేష్ తీశాడు. సీనియర్ హీరోయిన్ త్రిష ఇందులో కథానాయక పాత్రలో నటించింది. ఈ సినిమా మా షూటింగ్ కూడా కేవలం 125 రోజుల్లోనే పూర్తి కావడం విశేషం. లోకేష్ తీసిన అన్ని సినిమాల్లోనూ ఈ సినిమాకే కొంచెం ఎక్కువ సమయం పట్టింది.

సినిమాటిక్ యూనివర్స్

సినిమాను ఎంత వేగంగా తీయగలడో.. సినిమా టికెట్స్ నెలకొల్పడంలోనూ లోకేష్ దిట్ట. మా నగరంలో మెట్రో నగరాల్లో మనుషుల జీవితాలను పరిచయం చేసిన లోకేష్.. ఖైదీ సినిమాలో డ్రగ్స్ మాఫియాను పరిచయం చేశాడు. అందులోని పాత్రలను లింక్ చేస్తూ మాస్టర్ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా తర్వాత విక్రంలో మరింత రెచ్చిపోయాడు. ఈ సినిమాలో పాత్రలను మరింత బలంగా రాసుకున్నాడు. ఈ సినిమాలో సంతానం, రోలెక్స్ పాత్రలను హీరో పాత్ర కంటే బలంగా తీర్చిదిద్దాడు. తర్వాత వస్తున్న లియో సినిమాలోనూ వాటి ప్రస్తావన తీసుకొచ్చాడు. మొత్తానికి మోస్ట్ ఆ వెయిటింగ్ మూవీ అనే ట్యాగ్ లైన్ ను ప్రేక్షకుల ముందు ఉంచాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర దశలో ఉండగానే.. మరో సినిమాకు అప్పుడే చర్చలు మొదలుపెట్టాడు లోకేష్ కనగరాజ్.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular