Dil Raju: దిల్ రాజు రెండో వివాహం చేసుకునే నాటికి ఆయన వయసు దాదాపు యాభై ఏళ్ళు. ఆయన నిర్ణయం అప్పట్లో సంచలనం రేపింది. అందులోనూ వయసులో తనకంటే చాలా చిన్న మహిళను దిల్ రాజు వివాహం చేసుకున్నారు. 2020లో దిల్ రాజు-వైఘా రెడ్డి మ్యారేజ్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిరాడంబరంగా ముగించారు. వివాహం అనంతరం చిత్ర ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ దిల్ రాజు ఏర్పాటు చేశాడు. అయితే ఆ వయసులో దిల్ రాజు రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు? అనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది.

2017లో దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె దూరమైన మూడేళ్లకు వైఘా రెడ్డిని భార్యగా తెచ్చుకున్నారు. వారసులు లేని దిల్ రాజు ఆ కారణంతోనే మరలా పెళ్లి చేసుకున్నారనే వాదన గట్టిగా వినిపించింది. ఆయనకు ఒకటే కూతురు. పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు. కాగా మొదటిసారి దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ పై స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
అనిత చనిపోయే నాటికి నా వయసు 47 ఏళ్ళు. భార్య మరణం తర్వాత నేను ఒంటరి అయ్యాను. నేను పక్కా ఫ్యామిలీ మాన్. రోజంతా ఎక్కడ తిరిగినా సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. అనిత లేకపోవడం చాలా లోటుగా అనిపించేది. రెండేళ్లు అదే వేదనలో ఉండిపోయాను. నా కూతురు, అల్లుడు నా వద్దే ఉంటూ సప్పోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఏదో తెలియని బాధ ఉండేది. అప్పుడు పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకోమని సూచించారు. సన్నిహితులు కూడా అది మంచి ఆలోచన అన్నారు.

నా కూతురు సైతం పెళ్లి విషయంలో తన మద్దతు తెలిపింది. అప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను చూశాము. వైఘా అన్ని విధాలా నాకు సెట్ అవుతుందనిపించింది. అయితే నాతో మ్యారేజ్ అంటే పెద్ద ఛాలెంజ్. ఒక సెలబ్రిటీ అంటే ప్లస్ లు ఉంటాయి మైనస్ లు ఉంటాయి. అందులోనూ నాది సినిమా ప్రపంచం. ఈ విషయాన్ని పెళ్ళికి ముందే ఆమెతో మాట్లాడి, అంతా ఓకే అనుకున్నాక ముందుకు వెళ్ళాం. మాకు బాబు పుట్టాడు. నా ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా అబ్బాయికి పేరు పెట్టాం. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉందని, దిల్ రాజు చెప్పుకొచ్చారు.