Tollywood vs AP Govt: టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తిరుగుబాటు మొదలైంది. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు.. ఆన్ లైన్ విధానానికి నిరసనగా థియేటర్ యాజమాన్యాలు సినిమా హాళ్లను మూసివేస్తున్న పరిస్థితి నెలకొంది. రోజుకు కొన్ని చొప్పున మూతపడుతున్నాయి. ఇక హీరో నాని లాంటి వాళ్లు అయితే డైరెక్టుగా ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. టాలీవుడ్ అంతా ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఉందని కుండబద్దలు కొడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై కఠినంగా వ్యవహరించడాన్ని టాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. సినీ ప్రముఖులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. విపక్షాలు రాద్ధాంతం చేసినా ఏమాత్రం ప్రభుత్వం చలించడం లేదు. ఈ క్రమంలోనే ఈరోజు మరో గొంతు లేచింది. విప్లవ చిత్రాల పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఏపీలో థియేటర్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సినిమా హాళ్లు మూసేస్తుంటే ఏడుపు వస్తోందని ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా తీసేవాడు.. చూసేవాడు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. థియేటర్ యజమానులు సినిమా హాళ్లను మూసివేయవద్దని.. పరిస్థితుల పట్ల అధైర్యపడవద్దని పిలుపునిచ్చాడు. థియేటర్ల విషయంలో ‘మా’, నిర్మాతల మండలి జోక్యంచేసుకోవాలని ఆర్ నారాయణ మూర్తి కోరారు.
ఇక ఏపీలోని థియేటర్ల పరిస్థితులపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించడం సంచలనమైంది. ‘మాకు అపాయింట్ మెంట్ ఇస్తే సీఎం జగన్, మంత్రులను కలువాలనుకుంటున్నాం. తెలంగాణలో వచ్చినట్టే ఏపీలోనూ ఓ జీవో వస్తుందని ఆశిస్తున్నాం.. సినీ పెద్దలతో కమిటీ వేశాం.. తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చినట్టే ఐదో ఆటకు ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతాం.. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని ’ దిల్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దీన్ని బట్టి టాలీవుడ్ గొంతులు మెల్లిగా లేస్తున్నాయి. ఇక ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారని అర్థమవుతోంది. మరి వీరంతా ఏపీ సీఎం జగన్ ను కదిలిస్తారా? సమస్యలు పరిష్కరించుకుంటారా? అన్నది వేచిచూడాలి.