
కరోనా వైరస్ మహమ్మారి అనేక రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సినీ రంగం పై ఆధారపడిన చాలా మంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కొత్త చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు . ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితి దాపురించింది .
కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా మొత్తం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు గురువారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లల్లో ఉండి లాక్‌డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.