Kamal Haasan Health: సీనియర్ హీరో కమల్ హాసన్ సడన్ గా ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది. కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని కథనాలు వెలువడిన నేపథ్యంలో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లిన కమల్ హాసన్ గత రాత్రి అనారోగ్యానికి లోనయ్యారు. ఆయన చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కమల్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేని క్రమంలో అభిమానులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.

వైద్యుల సమాచారం మేరకు… కమల్ హాసన్ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అదే లక్షణాలతో ఆయన అడ్మిట్ అయ్యారు. కమల్ హాసన్ కి చికిత్స జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని స్పష్టం చేశారు. వైద్యుల ప్రకటన అభిమానుల్లో ధైర్యం నింపింది. వారు కొంచెం కుదుటపడ్డారు. తమ హీరో క్షేమం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ చాలా కాలం తర్వాత అతిపెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ రూ. 400 నుండి 500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. కమల్ హాసన్ మాజీ రా ఏజెంట్ రోల్ చేశారు. ఉత్కంఠగా సాగే యాక్షన్ క్రైమ్ డ్రామా కమల్ అభిమానులను అలరించింది. కమల్ హాసన్ మార్కెట్ ఎక్కడికీ పోలేదు. మంచి మూవీ పడితే ఆయన బాక్సాఫీస్ షేక్ చేస్తారని రుజువైంది.

విక్రమ్ విజయం తర్వాత కమల్ జోరు పెంచారు. ఆగిపోయిన భారతీయుడు 2 సెట్స్ పైకి తీసుకెళ్లారు. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తున్నారు. 1996 లో విడుదలై సంచలనాలు నమోదు చేసిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. అలాగే దర్శకుడు మణిరత్నంతో మరో మూవీ ప్రకటించారు. పొన్నియిన్ సెల్వన్ మూవీతో మణిరత్నం సైతం బాక్సాఫీస్ షేక్ చేశారు. మూడు దశాబ్దాల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ రానుంది.