Chiranjeevi: 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. చిత్ర పరిశ్రమకు సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణమ్ దక్కింది. 2006లో చిరంజీవి పద్మభూషణ్ అవార్డుతో గౌరవించబడ్డారు. పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం అందించే రెండవ పౌర పురస్కారం. ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు, చిత్ర వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రెండవ అతిపెద్ద పౌర పురస్కారం అందుకున్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భావోద్వేగ సందేశంతో కూడిన వీడియో విడుదల చేశారు. ”పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసిన క్షణంలో నా ఆనందానికి హద్దులు లేవు. నోట మాట రాలేదు. భారతదేశం అందించే రెండవ పౌర పురస్కారం పద్మ విభూషణ్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీ బిడ్డగా, అన్నగా భావించి ఆదరించిన ప్రజలు, నా సినీ లోకం అండ, నీడలా వెన్నంటి ఉన్న అభిమానుల కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీ ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. 45 ఏళ్లుగా నా సినిమా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సామాజిక సేవ చేస్తున్నాను.మీరు నాకు ఇచ్చిన దానికి నేను ప్రతిగా ఇచ్చింది గోరంతే. నన్ను పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్..” అని చిరంజీవి ముగించారు.
చిరంజీవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో టాలీవుడ్ కి చెందిన అక్కినేని నాగేశ్వరరావు పద్మ విభూషణ్ చే సత్కరించబడ్డారు. అలాగే అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లను కూడా పద్మ విభూషణ్ అవార్డుతో గౌరవించడం జరిగింది. ఆ లిస్ట్ లో చిరంజీవి వచ్చి చేరారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర టైటిల్ తో భారీ సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుందని సమాచారం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024