Chandrababu Arrest: స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు గత 35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒకవైపు న్యాయస్థానాల్లో కేసు విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారు. ఎండ ధాటికి తట్టుకోలేక ఆయన డిహైడ్రేషన్ గురయ్యారని.. శరీరంపై దద్దుర్లు వచ్చి అలర్జీతో బాధపడుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులతో పాటు టిడిపి శ్రేణులు ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని జైలు వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదలైంది. జైలు అధికారులు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైద్యులు ప్రకటన చేయాల్సింది పోయి జైలు అధికారులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. అటు చంద్రబాబు బరువు పై అధికార, విపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. జైలులో చంద్రబాబుకు జరగరానిది జరిగితే అందుకు సీఎం జగన్తో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు, టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అవసరమైతే రాజమండ్రిలోని సర్వజన ఆసుపత్రికి చంద్రబాబును తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి విఐపి చికిత్స గదుల ప్రాంగణాన్ని సిబ్బందితో అప్పటికప్పుడు శుభ్రం చేయించారు. దీంతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని ప్రచారం ప్రారంభమైంది. క్యాజువాలిటీ పక్కనున్న ఆ గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడు తో పాటు ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, మరో ఇద్దరు స్టాఫ్ నర్స్ లను కేటాయించారు.
చంద్రబాబు రిమాండ్ ను తరలించే సమయంలోనే జైలులో వసతులు కల్పించాలని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయితే చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రారంభం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యానికి గురికావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయోనని అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ కానీ చంద్రబాబు ఆరోగ్యం విషమిస్తే.. మొదటికే మోసం వస్తుందని గ్రహించి అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే జైలులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్యులు చంద్రబాబును పరీక్షించి మందులు అందించారు. ఇప్పుడు సర్వత్ర ఆందోళన వ్యక్తం కావడంతో చికిత్స అవసరమన్న మరుక్షణం రాజమండ్రి సర్వజన ఆసుపత్రికి తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే కోర్టులో చుక్కెదురవుతున్నా.. అనారోగ్యంతో చంద్రబాబు జైలు నుంచి బయట ప్రపంచానికి రానున్నారన్నమాట.