Champion Movie Review : నటీనటులు: రోషన్, అనస్వర రాజన్, కళ్యాణ్ చక్రవర్తి, వెన్నెల కిషోర్, మురళిధర్ గౌడ్ తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: R.మాది
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
నిర్మాణం: స్వప్న సినిమాస్
స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకుల్లో సహజంగానే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా కూడా తెలంగాణలోని బైరాన్ పల్లి గ్రామ ప్రజలు రజాకార్లతో చేసిన పోరాటం నేపథ్యంగా తెరకెక్కడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలోని రెండు పాటలు కూడా రిలీజ్ కు ముందే హిట్ కావడం కూడా అంచనాలు పెంచాయి. మరి ఈ ఛాంపియన్ ప్రేక్షకుల మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
మైఖేల్ విలియమ్స్(రోషన్) సికిందరాబాద్ లోని ఒక బేకరీలో పనిచేస్తుంటాడు. రోషన్ కు ఫుట్ బాల్ అంటే ప్రాణం. ఇండియాలో తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదని, అదే బ్రిటన్ కు వలస వెళ్తే అక్కడ లండన్ లోని ఫేమస్ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకుంటాడు. దానికి తగ్గట్టే రోషన్ కు అవకాశం వస్తుంది కానీ రోషన్ తండ్రి గతంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినందువల్ల రోషన్ కు లీగల్ రూట్ లో వీసా క్లియరెన్స్ రాదని చెప్తారు. ఇదిలా ఉంటే ఒక ఆవినీతిపరుడైన బ్రిటిష్ పైలట్ రోషన్ ను లండన్ తీసుకెళ్తానని, అలా చేయాలంటే కొన్ని ఆయుధాలను బీదర్ లో ఒక చోటుకు అక్రమంగా తరలించాలని షరతు విధిస్తాడు. రోషన్ అందుకు ఒప్పుకుంటాడు. తన స్నేహితుడితో కలిసి ఒక జీపులో ప్రయాణం మొదలు పెడతాడు. ఈ ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఎదురై రోషన్ బైరాన్ పల్లి చేరతాడు. అక్కడ ఏం జరిగింది? ఎలాగైనా ఈ మిషన్ పూర్తిచేసి లండన్ వెళ్లాలని అనుకున్న రోషన్ కోరిక తీరిందా? అసలు బైరాన్ పల్లి గ్రామస్తులు నిజాం ప్రభుత్వంతో ఎందుకు పోరాడుతున్నారు అనేది తెరమీద చూడాలి.
కథగా చూసుకుంటే అసలు ఇండియాలో ఉండకూడదు అనుకునే హీరో. ఫుట్ బాల్ ప్లేయర్ గా లండన్ లో సెటిల్ కావడం అతని ధ్యేయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం ప్రభువు భారతదేశంలో విలీనానికి ఒప్పుకోకపోవడంతో రజాకార్ల ఆగడాలు సాగుతున్న రోజుల నేపథ్యం. హీరో ఆ గ్రామానికి వచ్చి తనకు ఇష్టం లేకుండానే పోరాటంలో భాగం అవ్వాల్సి రావడం అంతా బాగానే ఉంది. కానీ అది తెరపై మాత్రం అంతా ఎఫెక్టివ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పోరాటానికి సంబంధం లేదు అన్నట్టే ఉంటాడు. దీంతో ప్రేక్షకులు కథతో కనెక్ట్ కాలేరు. తర్వాత అయినా హీరో ఎందుకు మారాల్సి వచ్చింది అనేది బలంగా చూపించలేకపోయారు. కొన్ని సీన్లు ఉన్నా అదంతా కృత్రిమంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో హీరో పాత్రను పోరాటంలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అటు బైరాన్ పల్లి- రజాకార్ల పోరాటం పూర్తిగా చూపించకుండా ఇటు హీరో లండన్ చేరుకోవాలనే ధ్యేయం చుట్టూ తిరగకుండా కథ అటూ ఇటూ పిల్లిమొగ్గలు వేసింది. దీంతో ప్రేక్షకులకు ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని పరిస్థితి. కొన్ని సీన్లు అక్కడక్కడా బాగున్నాయి అనిపించినప్పటికీ ఓవరాల్ గా సినిమా ఫ్లాట్ గా, బోరింగ్ గా సాగింది.
కథ ఎలా ఉన్నా ఈ సినిమాలో హీరో పాత్ర చాలా బరువైనది. ఈ సినిమా వరకూ చూసుకుంటే ఈ సినిమాకు పెద్ద మైనస్ రోషన్ ను హీరోగా తీసుకోవడం. రోషన్ యాక్టింగ్ బాగుంది, కష్టపడ్డాడు.. కానీ ఈ పాత్ర అతనికి అస్సలు నప్పలేదు. ఉదాహరణకు చెప్పుకుంటే బాహుబలిలో ప్రభాస్ స్థానంలో ఒక టీనేజ్ బాయ్ ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. రోషన్ కు మీసాలు గడ్డాలు ఉన్నప్పటికీ ఫేస్ లో ఆ పసితనం పోలేదు. కౌబాయ్ టైప్ రఫ్ నెస్, మాన్లీ నెస్ రోషన్ లో కనిపించలేదు. తన వయసుకు, ఫిజిక్ కు మించిన బరువైన పాత్ర చేశాడు. ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యేందుకు ఇది మరో కారణం. ఇక హీరోయిన్ అనుస్వర రాజన్ డబ్బింగ్ తేడాగా ఉంది. లీడ్ యాక్టర్స్ తోనే మనం కనెక్ట్ కాలేకపోతే ఇక సినిమాను ఎలా ఆస్వాదించగలం? ఊరి పెద్దగా రాజిరెడ్డి పాత్రలో నటించిన కళ్యాణ్ చక్రవర్తి పరవాలేదు కానీ తెలంగాణ యాసలో సహజంగా మాట్లాడలేకపోయాడు. రిజ్వీ పాత్రలో కెకె మేనన్ సూట్ అయ్యాడు కానీ పాత్ర తక్కువసేపే ఉంది.
మిక్కీ జె మేయర్ సంగీతం యావరేజ్ గా ఉంది. గిరగిరా సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల బాగాలేదు. R.మది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి వర్క్ కూడా చాలా బాగుంది. చారిత్రక నేపథ్యం చాలా సహజంగా చూపించారు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. వీక్ రైటింగ్
2. రాంగ్ క్యాస్టింగ్ (సరైన హీరో హీరోయిన్ లను ఎంచుకోకపోవడం)
3. మిస్ అయిన ఎమోషన్స్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సినిమాటోగ్రఫీ
2. గిర గిర సాంగ్
చివరి మాట: ఛాంపియన్ కావడానికి 7800 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. (హైదరాబాద్ -లండన్ మధ్య దూరం అది)
రేటింగ్: 2 /5