The Bads Of Bollywood Review: ఒకప్పుడు ఇండియన్ సినిమాకు చిరునామాగా వెలుగొందిన బాలీవుడ్, నేడు ఒక్క హిట్ కోసం చకోరా పక్షిలా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది? అసలు భారతీయ సినిమాగా వెలిగిన బాలీవుడ్ చిత్రాలు ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ బాలీవుడ్ లోపాలను నిర్భయంగా బట్టలిప్పేసిన వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood) అనేది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన వెబ్ సిరీస్. ఇది హిందీ చిత్ర పరిశ్రమలోని గ్లామర్ ప్రపంచాన్ని, దాని వెనుక ఉండే రాజకీయాలు, పోటీ, కుట్రలను వ్యంగ్యంగా, ధైర్యంగా చూపించే ప్రయత్నం చేసింది.
ప్రధాన కథాంశం:
ఢిల్లీకి చెందిన ఆస్మాన్ సింగ్ (లక్ష్య లల్వాని) అనే కొత్త కుర్రాడు తన మొదటి యాక్షన్ బ్లాక్‌బస్టర్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారతాడు. ఆస్మాన్ తన తొలి విజయం తర్వాత తన ముందు ప్రపంచం సాగిలపడుతుందని ఆశిస్తాడు, కానీ బాలీవుడ్ అంత సులభం కాదు.
అతను సూపర్ స్టార్ అజయ్ తల్వార్ (బాబీ డియోల్) కుమార్తె, సహనటి అయిన కరిష్మా తల్వార్ (సాహెర్ బాంబా) తో ప్రేమలో పడతాడు. అయితే, అజయ్ తల్వార్ ఒక ‘అవుట్‌సైడర్’ అయిన ఆస్మాన్‌తో తన కూతురు నటించడం లేదా సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేక అతని కెరీర్‌ను నాశనం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు.
Also Read: మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ…సెకండాఫ్ ఏంటి అలా ఉంది..?
బాలీవుడ్ తెరవెనుక కథ:
నిర్మాతలు, అగ్ర హీరోల ఆధిపత్యాలు, నెపోటిజం, కొత్త తరం యంగ్ హీరోలను తొక్కేసే రాజకీయాలు… ఇలా బాలీవుడ్ జాఢ్యాలన్నిటినీ కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సిరీస్, ఈ పతనానికి గల అసలు కారణాలను సునిశితంగా స్పృశించింది. బాలీవుడ్ పతనానికి కేవలం కథాబలం లేకపోవడమే కాదు, అక్కడ నడుస్తున్న ఎఫైర్లు, సినిమా పాలిటిక్స్, అగ్ర నటుల వ్యవహారశైలి వంటి అనేక అంశాలు కారణమని ఈ సిరీస్ సూటిగా చూపించింది.
శశి థరూర్ ప్రశంసలు
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌ను ప్రముఖ ఎంపీ శశి థరూర్ సైతం చూసి మెచ్చుకోవడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ సిరీస్‌ను చూసిన తర్వాత బాలీవుడ్‌లో లోటుపాట్లు, లోతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని సినీ విమర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాది సినిమా విజయ రహస్యం
బాలీవుడ్ ఎక్కడైతే తప్పులు చేసి పతనమవుతుందో, సరిగ్గా అదే సమయంలో దక్షిణాది సినిమా ఎందుకు అంతలా హిట్ అవుతుందో ఈ సిరీస్ పరోక్షంగా చూపించింది. బలమైన కథా కథనాలు, కంటెంట్‌పై దృష్టి, సాంకేతిక విలువలు, నటనకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు దక్షిణ భారతీయ చిత్రాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెస్తున్నాయి. ఈ విజయానికి బాలీవుడ్ గుణపాఠం నేర్చుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
చూడదగ్గ సిరీస్
బాలీవుడ్ తెరవెనుక నగ్నసత్యాన్ని, అంతర్గత రాజకీయాలను, పరిశ్రమ పాలిటిక్స్‌ను తెలుసుకోవాలంటే ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ నిజంగా ఓ చూడదగ్గ డాక్యుమెంట్ లేదా సిరీస్. ఇది కేవలం వినోదాన్ని అందించడమే కాదు, ఒకప్పటి ఇండియన్ సినిమా దిక్సూచి నేడు పతనానికి దారితీసిన మార్గాలను వివరిస్తుంది. బాలీవుడ్ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ, సినిమా ప్రేమికులు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది. మీరూ వీక్షించి, బాలీవుడ్ లోపాలను విశ్లేషించండి.
రేటింగ్ : 3/5
