నటీనటులు: ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, పశుపతి, లాల్, అమీర్ తదితరులు.
సంగీతం: నివాస్ K.ప్రసన్న
ఛాయాగ్రహణం: ఎళిల్ అరసు
దర్శకత్వం: మారి సెల్వరాజ్
నిర్మాణం: అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలమ్ స్టూడియోస్
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటవారసుడైన ధృవ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘బైసన్’. ఈ సినిమా తమిళంలో వారం క్రితమే రిలీజ్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రం ఈరోజే వచ్చింది. కుల వివక్ష, సామాజిక అసమానతల మీద రియలిస్టిక్ గా ఉంటూనే కమర్షియల్ టచ్ మిస్ కాకుండా సినిమాలు తీసే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ బైసన్ తెరకెక్కింది. అర్జున అవార్డు విన్నర్ అయిన వనతి గణేశన్ అనే కబడ్డీ ప్లేయర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందడం మరో విశేషం.
తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన వనతి కిట్టయ్య(ధృవ్ విక్రమ్) జీవితమే ఈ బైసన్. ఓ వైపు కుల వివక్ష, వర్గ పోరాటాలు, హింసతో రగిలిపోతున్న ప్రాంతంలో పుట్టిన కిట్టయ్యకు కబడ్డీ అంటే ప్రాణం. తన తండ్రి వేలుసామి(పశుపతి) ఈ గొడవలు మనకు వద్దని, కబడ్దీ ఆడి ఏదో సాధించడం కంటే ప్రాణాలతో ఉంటే చాలనే ఉద్దేశంతో తన కొడుకుని అన్నిటికీ దూరంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ పాండ్యరాజ్(అమీర్), కందసామిల మధ్య వర్గపోరాటం ఒక వైపు, రాణి(అనుపమ పరమేశ్వరన్) మన కిట్టయ్య ను ప్రేమించడంవల్ల తన తండ్రితో కిట్టయ్య కుటుంబానికి వచ్చే గొడవలు మరోవైపు కిట్టయ్య లక్ష్యానికి అడ్డంపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య కిట్టయ్య నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ గా భారతదేశం తరపున ఆడాలనుకున్న కల నెరవేరిందా, ఆ ప్రయాణంలో అతను, అతని కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది తెరపై చూసి తెలుసుకోవడమే.. వేరే దారి లేదు.
క్రీడలలో రాణించాలని ఉన్నా వివక్షకు గురవుతున్న వర్గాల క్రీడాకారులకు టాలెంట్ ఒక్కటే సరిపోదని చెప్పడమే కాకుండా ఏం కావాలో ఆ అంశాలను దర్శకుడు చూపించడం ఓ గొప్పవిషయం. వాటిలో ముఖ్యంగా జీవితంలో గొప్ప లక్ష్యం ఉన్నవాడికి ఎంతో ఓర్పు, సహనం ఉండాలని, అవి లేకపోతే క్రీడాకారుడిగా జీవితం ఒక్క క్షణంలో ముగిసిపోతుందని చూపించాడు. ఎన్నో సందర్భాలలో కిట్టయ్య పాత్ర అటు పరిస్థితులకు తలొగ్గలేక, ఇటు పూర్తిగా సహనంగా ఉండలేక మానసికంగా సతమతం అవుతున్న కోణాన్ని చక్కగా ఆవిష్కరించాడు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కొందరు ‘కోటా’ అంటూ మానసికంగా బాధ పెడుతున్నప్పటికీ వారందరి చేత చప్పట్లు కొట్టించుకునేలా ఆట లో నైపుణ్యం చూపించాలని హీరోను గోల్ వైపు దూసుకెళ్ళేలా రెడీ చేయడం కూడా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
నిజజీవితంలో అర్జున అవార్డు సాధించిన క్రీడాకారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎత్తుపల్లాలు, డ్రామా అన్నీ ఉన్నాయి కానీ సినిమాలో చాలా చోట్ల సీన్స్ రిపీట్ ఆయనట్టుగా కనిపిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఓవర్ డోస్ అయిన ఫీలింగ్ కూడా రావచ్చు. సినిమాలో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేయడంతో కథ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. దీనివల్ల అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పలేం. రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది.
దర్శకుడు మారి సెల్వరాజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా అంత గొప్పగా మాత్రం అనిపించదు. దీనికి ఒక కారణం తన సినిమాలలో రిపీట్ అవుతున్న థీమ్, రెండోది కథను రియలిస్టిక్ గా చెప్పే ప్రయత్నం. కథ సీరియస్ గా ఉండడంతో హీరో హీరోయిన్ల మధ్య ఉండే లవ్ ట్రాక్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని డైలాగులు మాత్రం ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇక ఎళిల్ అరసు సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే నేపథ్య సంగీతంసినిమా థీమ్ ను ఎలివేట్ చేసింది. అయితే తెలుగు డబ్బింగ్ కారణమో, లేదా తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడం వల్లో తెలీదు కానీ పాటలు మాత్రం బాగలేవు. ఎడిటింగ్ కూడా ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.
ధృవ్ ఈ సినిమా లో చాలా బాగా నటించాడు. క్రీడాకారుడిగా నటించడం అంటే యాక్టింగ్ పరంగానే కాకుండా ఫిజికల్ గా కూడా ఎంతో శ్రమతో కూడుకున్నది. ధృవ్ కష్టం తెరపై కనిపించింది. సీనియర్ నటులు పశుపతి, లాల్, అమీర్ అందరూ తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. అనుపమ పాత్రకు ఎక్కువగా స్కోప్ దక్కలేదు. హీరో అక్క పాత్ర లో నటించిన రజీషా విజయన్ కే తనకంటె స్కోప్ ఎక్కువ. రజీషా తన పాత్రకు న్యాయం చేసింది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. రిపీట్ అయినట్టు అనిపించే సీన్స్
2. పాటలు
3. ఎక్కువైన తమిళ నేటివిటీ
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. ధృవ్ విక్రమ్, పశుపతిల యాక్టింగ్
2. సినిమాటోగ్రఫీ,
3. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫైనల్ వర్డ్: క్యాస్ట్ లెసన్
రేటింగ్: 2.5 /5
ఓవరాల్ గా చెప్పొచ్చొది ఏంటంటే… ఇదో ఓ సీరియస్ సినిమా.. సీరియస్ గానే చూడాలి.. ఈ సినిమాలో హీరో మోములో ఒక పెద్దగా నవ్వు కూడా ఉండదు. అందుకనే ఈ సీరియస్ సబ్జెక్ట్ ను అలానే చూసి ఎంజాయ్ చేయండి.