Bheemla Nayak : ఈ రోజు అంతా భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ప్రభావం.. ఉద్యోగులపై కూడా బలంగా పడింది. అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు మూవీ చూసేందుకు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో షాకైన కంపెనీ హెచ్ఆర్ విభాగం వెంటనే ఈరోజు సెలవు ప్రకటించింది. శుక్రవారానికి బదులుగా ఈ ఆదివారం విధుల్లోకి రావాలని ఉద్యోగులను యాజమాన్యం ఆదేశించింది.
ఇక నిర్మల్ పట్టణంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. స్థానిక తిరుమల థియేటర్‌లో భీమ్లానాయక్ సినిమాకు సౌండ్ సరిగా రావట్లేదని రెచ్చిపోయారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టారు. బిగ్గరగా అరుస్తూ రచ్చ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పవన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. బాణాసంచా కాల్చి, డ్యాన్సులు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లలో భీమ్లానాయక్ సినిమా ఆగిపోయింది. విస్సన్నపేటలో టికెట్ రూ.35 మాత్రమే ఉండటంతో థియేటర్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఆ రేటుకు ఆడించలేమంటూ షో నిలిపివేశారు. సినిమా వేయాలని ఫ్యాన్స్ అరగంట పాటు రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మైలవరంలోనూ తగ్గించిన రేట్లతో షో వేయలేమని థియేటర్ మూసేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో బెనిఫిట్ షో వేయలేదని అద్దాలు పగులగొట్టారు.
పవన్ సినిమా పై భీమ్లానాయక్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నాడు. పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉన్న పోస్టర్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఒకే ఫ్రేమ్‌లో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలి’ అని పేర్కొన్నాడు. త్రివిక్రమ్ రైటింగ్ వర్క్, సాగర్ చంద్ర డైరెక్షన్, తమన్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయన్నాడు.