
బంగ్లాదేశ్ హీరోయిన్ పోరీ మోనీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె మద్యం, డ్రగ్స్ తీసుకొని ఆడపిల్లలతో వ్యభిచారం చేయించిందని.. తను కూడా తాగి పలువురితో కలిసి ఎంజాయ్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఆమె దందాలు బయటపడుతున్నాయి.
పోరీ మోనీ వ్యవహారాలపై తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరీ మోనికి రచయిత్రి తస్లీమా సపోర్టుగా నిలిచింది. ‘ఇంట్లో మద్యం ఉంచుకుంటే బంగ్లాదేశ్ అమ్మాయిలను అరెస్ట్ చేస్తారు’ అంటూ తమ దేశ ప్రభుత్వంపై సెటైరికల్ గా తస్లీమా ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఫేస్ బుక్ లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పోలీసులు పోరీ మోనీపై ఎలాంటి కేసులు పెట్టారో అందులో తస్లీమా పేర్కొన్నారు. ఈ కేసుల్లో వేటికీ ఆధారాలు లేవు అని ఆమె అన్నారు.‘మద్యం తాగడం.. మద్యం ఇంట్లో ఉంచుకోవడం.. ఇంటిలో చిన్న బార్ కలిగి ఉండడం నేరంకాదు.. ఎవరైనా ఇంటికి ఫ్రెండ్లీగా వచ్చి కలిసి మద్యం తాగితే.. నేరం ఎలా అవుతుంది? ఇంట్లో డీజే పార్టీ జరుపుకుంటే నేరం ఎలా అవుతుంది? ఎవరితోనే సినిమా వెళ్తే తప్పేంటి? నగ్నంగా ఫొటోలు దిగితే తప్పేంటి?’ అంటూ వరుస ప్రశ్నలను తస్లీమా సంధించారు.
మగాడికి ఒకరి కంటే ఎక్కువమంది భార్యలు ఉండడం తప్పు కాదు కానీ.. ఒక అమ్మాయి తాగి ఎవరితోనే పడుకుంటే తప్పు అవుతుందా? మద్యం బాటిల్లు ఇంట్లో ఉంటే తప్పు అవుతుందా? అంటూ సోషల్ మీడియాలో తస్లీమా ప్రశ్నించారు.ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
బంగ్లాదేశ్ లోని ప్రముఖ హీరోయిన్ పోరీ మోనిని డ్రగ్స్, విదేశీ మద్యం కేసులో పోలీసులు ఆగస్టు 4న అరెస్ట్ చేశారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించిన తర్వాత ఈ అరెస్ట్ జరగడంతో ఇదంతా కక్ష సాధింపు అని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తస్లీమా హాట్ కామెంట్స్ చేసింది.