
Tollywood AP Govt : తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ సర్కారు సహాయం చేయడం సంగతి అటుంచితే.. ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ షాకుల మీద షాకులు ఇస్తోంది. కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి.. టికెట్ల రేట్లు తగ్గించి గట్టిషాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించి, గండం గట్టెక్కించుకోవాలని సినీ ప్రముఖులు చూస్తుండగా.. ఏకంగా టిక్కెట్ల అమ్మకాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటామంటూ సర్కారు ప్రకటించడంతో సినీ పెద్దల గుండెల్లో బండపడింది.
ఇప్పుడు సినీ ప్రముఖుల నెత్తిన మరో పిడిగు వేసేందుకు సర్కారు సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్నవారంతా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. హీరోల నుంచి నిర్మాతల దాకా.. దర్శకుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకూ.. అంతా ఆ రాష్ట్రవాసులే. అందుకే.. హైదరాబాద్ కేంద్రంగా ఇండస్ట్రీ కొనసాగినప్పటికీ.. ఎప్పటికో ఒకనాటికి విశాఖ తీరానికి తరలించాలనే ఆలోచనైతే చాలా మందికి ఉంది. అందుకే.. అక్కడ స్టూడియోలు నిర్మించుకోవాలని భావిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
ఈ క్రమంలోనే.. ఏపీలో సినీ స్టూడియోలు నిర్మించుకోవడానికి దాదాపు పాతిక మంది వరకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారట. దరఖాస్తు చేసుకున్నది ఎందుకంటే.. భూముల కోసం. ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. స్టూడియోలు నిర్మిస్తామని, తద్వారా కార్మికులకు ఉపాధితోపాటు ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుందనే పద్ధతిలో భూకేటాయింపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కనీసం.. ఒక్కొక్కరికి ఒక ముప్పై ఎకరాలైనా ఇవ్వకపోతుందా.. అనే ఆశతో ఉన్నారు. వీరిలో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, అరవింద్ వంటి ప్రముఖులు ఉన్నారట.
సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా.. వీరంతా మౌనంగా ఉండడానికి కారణం ఇదేనని అంటున్నారు. అయితే.. ఇప్పుడు వీరికి భూములు కూడా ఇవ్వొద్దని సర్కారు భావిస్తున్నట్టు ఉప్పందుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రాజధానిపై క్లారిటీ లేదు. డొల్లబోయిన ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు భూములు అమ్ముకోవాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వాళ్లకు భూములు కేటాయించాల్సిన అవసరం లేదన్నది జగన్ సర్కారు ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.
టికెట్ రేట్లు తగ్గించినా.. సినిమా టికెట్లు తామే అమ్ముతాని చెప్పినా.. ఈ భూముల కోసమే సినీ పెద్దలు మౌనంగా ఉన్నారని అంటున్నారు. మరి, ఇప్పుడు ఏకంగా వీరి ఆశలపై సర్కారు నీళ్లు చల్లబోతోందని అంటున్నారు. ఇదే జరిగితే సినీ ప్రముఖులు ఏం చేస్తారు? సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారా? తిరుగుబావుటా ఎగరేస్తారా? అన్నది చూడాలి.