Mahesh Babu- CM Jagan: సూపర్ స్టార్ కృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోకు చేరుకున్న సీఎం జగన్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. అంతిమ సంస్కారాల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బాలకృష్ణ, ఆలీ కూడా ఉన్నారు. వారు కూడా తమ ప్రియతమ హీరోకు ఘనంగా నివాళులర్పించారు. జయప్రద కూడా కృష్ణ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం పద్మాలయ స్టూడియోలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సందర్శించి నివాళులర్పించారు. కేసీఆర్ సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం గురించి కొనియాడారు. సినిమా పరిశ్రమలో అజాతశత్రువుగా ఆయన తన మనుగడ కొనసాగించారని పేర్కొన్నారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సినిమాకే మకుటాయమానంలేని రారాజుగా వెలుగొందిన కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్లడం అందరిని కలచివేసింది.
ప్రజల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. దీంతో ప్రముఖులు మహేశ్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కృష్ణకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు చాలా మంది వేచి ఉన్నారు. వీఐపీల రాకతో ప్రజలను కాసేపు ఆపారు. దీంతో తోపులాట జరిగింది. జనసందోహం చూస్తే కృష్ణ ఎంత మంది హృదయాల్లో నిలిచారో తెలుస్తోంది. పద్మాలయ స్టూడియో జనంతో కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా భద్రత కల్పించడం కష్టమైపోయింది. ఇంకా సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగే సమయంలో ఎంత మంది వస్తారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానుల కోలాహలంతో స్టూడియో ప్రాంగణం జనసంద్రంగా మారింది. అభిమానులు క్యూ లైన్లలో బారులు తీరడం గమనార్హం. సూపర్ కృష్ణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారనేదానికి ఇదే నిదర్శనంగా చెబుతున్నారు. వీఐపీ లు రావడంతో జనాన్ని కాసేపు ఆపడంతో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడటం ఆశ్చర్యం కలిగించింది.
