కరోనా సెకండ్ మహోగ్రరూపమై దేశాన్ని చుట్టు ముట్టేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ శరవేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆయన కొవిడ్ టెస్టు చేయించుకోగా.. పాజటివ్ రిపోర్టు వచ్చినట్టు సమాచారం. దీంతో.. ఆయన ఐసోలేషన్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు, బండ్ల గణేష్ తదితరులకు సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. దిల్ రాజు-అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్-3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాతలకు కొవిడ్ సోకడంతో సినిమా షూటింగ్ అర్ధంతరంగా నిలిపేశారు.
టాలీవుడ్లో ప్రముఖులు మాత్రమే కాకుండా.. ఇతర టెక్నీషియన్లు, నటీనటులు అందరూ కొవిడ్ బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనం ఊహిస్తున్న దానికన్నా ఎక్కువగా పరిస్థితి విజృంభిస్తోందని అంటున్నారు.
తెలంగాణలో రోజుకు 4 వేలు, ఏపీలో 5 వేల కేసులు లెక్కలు చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా లెక్కలు అంతకు రెండు మూడింతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అందువల్ల.. అందరూ కొవిడ్ జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.