Anil Ravipudi: విచిత్రమైన టైటిల్స్ తో సంక్రాంతికి రావడం, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టడం అనిల్ రావిపూడి కి ఈమధ్య రొటీన్ అయిపోయింది. ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ అనే టైటిల్ ని పెట్టినప్పుడు, ఇదేమి టైటిల్ రా బాబు అని అప్పట్లో అందరూ తిట్టారు. చివరికి ఆ సినిమాకే 300 కోట్ల గ్రాస్ వసూళ్లను అందించారు జనాలు. పైగా టైటిల్ కూడా ఎదో పెట్టినట్టుగా లేదు, సినిమా కథకు తగ్గట్టుగానే ఉంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అన్నప్పుడు, ఆయనతో ఇలాంటి టైటిల్స్ పెడితే వర్కౌట్ అవ్వవు, మంచి మాస్ టైటిల్ ని పెడుతారు లే అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ‘మన శంకర వరప్రసాద్ గారు..పండక్కి వస్తున్నారు’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ టైటిల్ పెట్టినప్పుడు మెగా అభిమానులు సోషల్ మీడియా లో అనిల్ రావిపూడి ని ట్యాగ్ చేసి పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఇలాంటి టైటిల్ పెడుతావా? అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు?, ఆయనకీ ఉన్న మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవా అంటూ నానా మాటలు అన్నారు. చివరికి ఆ సినిమాతోనే సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అతి త్వరలోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని దాటి, వేరే లెవెల్ కి వెళ్లనుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి తదుపరి చిత్రం లో హీరో ఎవరో ఇంకా ఖరారు కాలేదు. కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ అయిపోయిందట. ఏందీ వెంకీ సంగతి..అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూ ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ లో చిరు, వెంకీ కలిసి డ్యాన్స్ వేసిన సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలోని ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అనేది అనిల్ రావిపూడి తదుపరి చిత్రం టైటిల్ అట.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి హీరోలు గా నటిస్తారని టాక్. మరో వారం రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక వివరాలు తెలుస్తాయి. ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ప్లాన్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ముందు ఫ్రెష్ సబ్జెక్టు తోనే సినిమా చేస్తాడట అనిల్ రావిపూడి. మరి వచ్చే సంక్రాంతికి మరో విచిత్రమైన టైటిల్ తో రాబోతున్న అనిల్ రావిపూడి ఎంత మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.