ఆంధ్రప్రదేశ్ లో చిత్రసీమ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ నిర్వాకంతో పరిశ్రమ కుదేలయిపోయే ప్రమాదం పొంచి ఉంది. నాయకుల చేతలతో నష్టాల్లో పడిపోతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ తరువాత తొలిసారిగా తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్ని దారులు మూసుకుపోయి థియేటర్లు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో పార్కింగ్ ఫీజు తీసుకునే హక్కును థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టికెట్ల రేట్లలో కూడా యాజమాన్యాలకే అప్పగించింది. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ఏపీలో సినిమాల్ని విడుదల చేసుకోవాల్సి ఉంది. నైట్ షోలకు సైతం ఇక్కడ అనుమతులు లేవు. దీంతో పరిశ్రమ నివ్వెరపోయే పరిస్థితి దాపురించింది.
చిత్రసీమ బాధలు చెప్పుకుని తమను ఆదుకోవాలని భావిస్తున్నా సీఎం జగన్ మాత్రం వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. చిత్రసీమపై జగన్ మొదటి నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ సీఎం అయ్యాక కనీసం సన్మానం కూడా చేయలేదనే విషయంలో వారిపై కావాలనే నిబంధనల పేరుతో కష్టాలకు గురిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించారని, సవరించిన రేట్ల విషయంలో టాలీవుడ్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా పట్టించుకోవడం లేదు దీంతో పరిశ్రమ వర్గాలు పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చలనచిత్ర పరిశ్రమపై ప్రభుత్వానికి ఇంత పక్షపాతం పనికిరాదని హితవు చెబుతున్నాయి. పరిశ్రమ బతకాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అవసరమే అని చెబుతున్నాయి. దీంతో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.