Allu Aravind: ఢిల్లీకి రాజైనా.. తల్లికి ఎప్పుడూ కొడుకే. అలాగే ఎంత ఎత్తుకు ఎదిగినా తండ్రికి కొడుకు ఎప్పుడూ చిన్నపిల్లాడే. అందుకే కొన్ని కొన్ని విషయాల్లో కొడుకులు ఎంత పెద్దవారైనప్పటికీ తండ్రులు వారిస్తూ ఉంటారు. దీనిని కొడుకులు కూడా ఆనందంగా అనుభవిస్తారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న మ్యాజికే అటువంటిది. ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశాన్ని వసుదైక కుటుంబం అని పిలుస్తారు. ఇక ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే.. తెలుగు చిత్ర సీమలో విలక్షణమైన నటుడుగా పేరుగాంచిన అల్లు రామలింగయ్య.. తెర పైన ఎంత హాస్యాన్ని పంచుతారో.. తెర వెనుక అంత కోపంగా ఉంటారు. నిర్మాతను ఏమాత్రం ఇబ్బంది పెట్టని అల్లు రామలింగయ్య.. తన కొడుకు అల్లు అరవింద్ మాత్రం ఒకసారి కొట్టారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇటీవలే చెప్పుకొచ్చారు. ఇంతకీ జరిగిన సంఘటన ఏమిటంటే.

అలిగి వెళ్లిపోయారు
అల్లు రామలింగయ్య హాస్యం తెరవరకే పరిమితం.. మామూలుగా అయితే ఆయనకు తీవ్రమైన కోపం ఉంటుంది. ఒక సన్మానం విషయంలో భార్యతో గొడవపడి అల్లు రామలింగయ్య అలిగారు. చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.. ఈ విషయం తెలిసిన అల్లు అరవింద్ కారు తీసుకొని వెళ్ళి ఆయనను వెతికి తీసుకొచ్చారు. కారు ఇంటికి చేరుకున్న తర్వాత సడన్ గా బ్రేక్ వేశారు. ఈ సంఘటనతో ఒకసారి గా కోపొద్రిక్తుడైన అల్లు రామలింగయ్య నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పారంటూ అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా ఆయనపై గట్టిగా అరిచారు. అప్పటికి అరవింద్ వయసు 45 ఏళ్లు. అయితే అల్లు రామలింగయ్య కొట్టింది ఎవరూ చూడలేదని అరవింద్ అనుకున్నారు. కానీ ఇంట్లోకి వెళ్లాక ఆయన భార్య నిర్మల “మావయ్య గారు మిమ్మల్ని ఎందుకు కొట్టారు” అని అడిగింది.. దానికి అరవింద్ షాక్ అయ్యారు.
మరో రెండు రోజుల్లో కోమాలోకి వెళ్తారనగా..
అల్లు రామలింగయ్యకు ముందు చూపు ఎక్కువ. అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దేనికి పనికిరాడు అని ఒక నిర్ణయానికి వచ్చి.. ఆ రోజుల్లోనే ఆయన పేరు మీద ఒక పాలసీ కట్టారు. తీరా అల్లు రామయ్య గతించిన తర్వాత పది లక్షల చెక్కు అల్లు అర్జున్ కు వచ్చింది.. కనీసం ఈ పదిలక్షల తోనైనా జీవితంలో స్థిరపడతాడని అల్లు రామలింగయ్య నమ్మకం. ఇక మరో రెండు రోజుల్లో కోమాలోకి వెళ్తారనగా.. అల్లు అరవింద్ ను చేతితో సైగలు చేస్తూ పిలిచారు. ఇదే వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ. తర్వాత అల్లు రామలింగయ్య కోమాలోకి వెళ్లారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన కన్నుమూశారు.

“ఒకవేళ ఆయన ఇప్పుడు కనిపిస్తే అల్లు అనే పేరు కోసం నేను కష్టపడ్డాను.. ఇప్పుడు నీ మనవళ్లకు కూడా ఇచ్చాను. వారు దానిని మరింత పైకి తీసుకెళ్తున్నారని చెబుతానని” ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ వివరించారు. అయితే అల్లు రామలింగయ్య కి తన తండ్రి ద్వారా పాలకొల్లులో నాలుగు ఎకరాల భూమి వచ్చింది. ఆరోజుల్లోనే ఆయన సినిమాల కోసం మద్రాస్ వెళ్లిన నేపథ్యంలో.. అక్కడ గడిపేందుకు రెండు ఎకరాల భూమిని ఆ రోజుల్లోనే అమ్మాడు. సినీ రంగంలో నిలదొక్కుకున్నప్పటికీ.. పాలకొల్లులో ఎటువంటి భూములు కొనుగోలు చేయలేదు. ఇక ప్రస్తుతం అల్లు రామలింగయ్యకు చెందిన రెండు ఎకరాలు పాలకొల్లులో అలాగే ఉంది. ఆయన జ్ఞాపకార్థం ఆ ఊరిలో రామలింగయ్య విగ్రహాన్ని అల్లు అరవింద్ ఏర్పాటు చేయించారు. ఈ ఏడాది శత జయంతి జరుపుకుంటున్న అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం పాలకొల్లులో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారు.