Allu Arjun Arrested: అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. మహిళ మృతికి అల్లు అర్జున్ ని నేరుగా బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.
నాని, శర్వానంద్, రష్మిక మందాన, నితిన్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. కాగా హైకోర్టులో అల్లు అర్జున్ కి ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉన్నారు. ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్ క్లాస్-1కు ఆయనను తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం.
ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే. ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. ఈ కారణాలతో అల్లు అర్జున్ జైల్లో దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన నిద్ర కూడా పోలేదని సమాచారం. అల్లు అర్జున్ విడుదలైన వెంటనే సమీపంలోగల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చారు.
అక్కడి నుండి నేరుగా తన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. రేవతి మరణం దురదృష్టకరం. నేను బాగానే ఉన్నాను. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఇది ఒక కఠిన పరిస్థితి. కేసు కోర్టులో ఉండగా నేను ఎక్కువ మాట్లాడలేను, మద్దతుగా నిలిచిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు.
ఇక అల్లు అర్జున్ రాకతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అయాన్, అర్హ ఉబ్బితబ్బిబయ్యాడు. నాన్నను చూసిన వెంటనే పరుగున వచ్చారు. ఈ సన్నివేశం భావోద్వేగానికి గురి చేసింది.