Thandel Pre Release Event: అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం లో నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా ప్రతీ ప్రీ రిలీజ్ కంటెంట్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అనే సంకేతాలు అభిమానులకు వెళ్లేలా చేసింది ఈ సినిమా. శ్రీకాకుళం లోని ఒక గ్రామం లో జరిగిన యదార్ధ సంఘటనలు తీసుకొని, సినిమాటిక్ లిబర్టీ కోసం కొంత ఫిక్షన్ ని జత చేసి, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రాసుకున్న ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. సినిమాలో దేశభక్తి కూడా అంతర్లీనంగా ఉంటుంది కానీ, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడ్ చిన్నడిగానే ఉంటుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ చందు మొండేటి ఇంటర్వ్యూ లో తెలిపాడు.
ఇకపోతే మొన్న తమిళనాడు లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపించగా, ప్రముఖ హీరో కార్తీ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. నిన్న ముంబై లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. గజినీ సినిమా సమయం నుండి అల్లు అరవింద్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఆయన అడిగిన వెంటనే వచేసాడు అమీర్ ఖాన్. ఇక తెలుగు లో నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకొని ఈ ఈవెంట్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ కూడా కొన్ని లిమిట్స్ పెట్టాడట.
అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు లేకుండా జరిపించాలని మూవీ టీం కి ఆదేశాలు జారీ చేశాడట. కేవలం మూవీ టీం, కొంతమంది మీడియా మిత్రులు తప్ప, అభిమానులకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి ప్రవేశం లేదని స్పష్టం గా చెప్పేసారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ లో చాలా మార్పులు వచ్చాయి అనడానికి కారణం ఇదే. వాస్తవానికి కొన్నాళ్ల పాటు ఆయన మీడియా ముందుకు రాకూడదని అనుకున్నారు. కానీ తన సొంత బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకి మాత్రమే కాదు, గతంలో గీత ఆర్ట్స్ నుండి విడుదలైన ప్రతీ సినిమాకి అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా విచ్చేశాడు. అవి అదృష్టం కలిసొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా కూడా నిలిచాయి. ఈ సినిమాకి కూడా అదే ఫలితం వస్తుందని బలమైన నమ్మకం తో ఉంది మూవీ టీం.