Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అంచలంచలుగా పైకి ఎదిగిన తీరు నేటి తరం యువతకి ఒక ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదగాలి అనే కల ఉన్న యువకుడు, దాని కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధం అనేందుకు ప్రతీక అల్లు అర్జున్. చిరంజీవి(Megastar Chiranjeevi) మేనల్లుడిగా, అల్లు అరవింద్(Allu Aravind) కుమారుడిగానే ఆయనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా టాలెంట్ లేకపోతే పైకి ఎదగడం కష్టం. అల్లు అర్జున్ తన టాలెంట్ తో రెండవ సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెరుపు లాగా డ్యాన్స్ వేస్తున్నాడు, ఎవరీ కుర్రాడు అంటూ దేశం మొత్తం ఇతనివైపు అప్పటి నుండే చూడడం మొదలు పెట్టారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన అల్లు అర్జున్, పుష్ప 2 తో నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా తన జెండా పాతేశాడు.
నేడు మన సౌత్ నుండి రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా ఉందా అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే పేరు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ ఎదుగుదలని చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా కుళ్ళుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు మరింత కుళ్ళుకునే విధంగా లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటన సంచలనంగా మారింది. అంతర్జాతీయంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్'(The Hollywood Reporter) ఇండియన్ ఎడిషన్ తొలి పత్రికపై ముఖ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోని ప్రచురించారు. ఈ పత్రిక విశిష్టత ఏంటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ 1930 వ సంవత్సరం లో అంతర్జాతీయంగా డైలీ ట్రేడ్ పేపర్ గా ప్రసిద్ధి గాంచింది. 2010 వ సంవత్సరం నుండి ఈ పత్రికకు సంబంధించిన ప్రింట్ వెర్షన్ మొదలైంది. 94 సంవత్సరాల క్రితం తొలి సంచిక మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి మీడియా లో ఈ పత్రిక ఒక సంచలనంగా మారింది.
ఈ పత్రికకు సంబంధించిన ఆన్లైన్ వెబ్ సైట్ కూడా అందుబాటులోనే ఉంది. ఇంతటి గొప్ప చరిత్ర గల ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ మన భారతదేశంలోకి అడుగుపెట్టింది. దీని ఖరీదు మన వీక్లీ మ్యాగజైన్ లాగా కేవలం 60 నుండి 70 రూపాయిలు మాత్రం కాదు. దీనిని కొనాలంటే కనీసం 200 రూపాయిలు వెచ్చించాల్సిందే. ఇలాంటి ప్రతిష్టాత్మక వార్తాపత్రికపై దేశం లో ఇంత మంది స్టార్ హీరోలు ఉండగా, కేవలం అల్లు అర్జున్ ఫోటోనే తమ కవర్ పేజీపై వేశారంటే, ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ మ్యాగజైన్ పై ఎంతో మంది హీరోల ఫోటోలు కవర్ పేజీపై పడొచ్చు, కానీ అ కవర్ పేజీపై పడిన మొట్టమొదటి హీరో గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్రలో గుర్తుండిపోతాడు.