
బాధలో గాని , కష్టంలో గాని ఉన్నపుడే మనలో ఉన్న అసలు మనిషి బయటికి వస్తాడు. ఈ నిజాన్ని ప్రూవ్వ్ చేసే ఘటన ఒకటి ముంబై లో జరిగింది. కరోనా వైరస్ కారణంగా డాక్టర్లు ప్రాణాల్ని పణంగా పెట్టి జనం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక హిందీ సినీ నటి.. బాధ్యతతో జనం కోసం నర్సు గా మారి సేవ చేయడానికి ముందు కొచ్చింది .
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ సినిమా తో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన “కాంచలి “చిత్రం లో హీరోయిన్ గా నటించిన షికా మల్హోత్రా ఇపుడు తన అసలి రూపం బయట పెట్టుకొంది. ముంబయిలోని ఓ హాస్పిటల్లో నర్సుగా మారి కరోనా బాధితులకు సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రం మహారాష్ట్రనే …. అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది.అలాంటి అవసరాన్ని గుర్తించిన షికా మల్హోత్రా వెంటనే తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొంది. సినిమాల్లోకి రావడానికి ముందు తాను చేసిన నర్సింగ్ కోర్స్ సమాజానికి ఉపయోగపడాలని భావించింది.వెంటనే ముంబై లోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తాను నర్స్ గా సర్వీస్ చేయాలను కొంటున్నానని తెలిపింది. విధుల్లో జేరి నర్స్ గా సేవలందిస్తోంది .
నటి కాకముందు షికా మల్హోత్రా ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ లో డిగ్రీ చేసింది. తద్వారా షికా మల్హోత్రాకు నర్సుగా సేవలందించే అర్హత ఉంది. ఇప్పుడు ఈ కష్ట కాలంలో తన చదువుకు న్యాయం చేయాలని, దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. పేషెంట్ల సేవలో షికా మల్హోత్రా విరామం లేకుండా పని చేస్తున్నతీరు ,కమిట్మెంట్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారట …