Actress Meena : నటిగా నాలుగు దశాబ్దాల అనుభవం. ఇన్నేళ్ళలో మీనా మీద ఎలాంటి వివాదం లేదు. చాలా సౌమ్యురాలిగా పేరున్న మీనా దర్శక నిర్మాతలు, హీరోల ఫేవరెట్ హీరోయిన్. మంచి వాళ్ళకే కష్టాలు అన్నట్లు మీనా జీవితంలో అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆమె భర్త కన్నుమూశారు. జూన్ 28న మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో చనిపోయారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ మీనాను కన్నీటి కడలిలోకి తోసి సుదార తీరాలకు వెళ్లిపోయారు. 46 ఏళ్ల వయసులో మీనా భర్తను కోల్పోయి ఒంటరి అయ్యారు. 2009లో విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకున్నారు. ఆయన బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్.
మీనా-విద్యాసాగర్ లకు నైనిక అనే కుమార్తె ఉన్నారు.పాప వయసు పదేళ్ల లోపే. విద్యాసాగర్ హఠాన్మరణాన్ని మీనా తట్టుకోలేకపోయారు. ఆమె డిప్రెషన్ కి గురయ్యారు. తోటి నటులు కలిసి మీనాను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉంటే అదే వేదన వెంటాడుతుందని మీనా కొద్ది రోజులు టూర్ కి వెళ్లారు. మానసిక ప్రశాంత పొందే ప్రయత్నం చేశారు. మీనా మానసికంగా కొంచెం మెరుగయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలో ఆమె మళ్ళీ షూటింగ్స్ లో జాయిన్ కానున్నారు. మీనా గతంలో ఒప్పుకున్న చిత్రాల చిత్రీకరణ పూర్తి చేయనున్నారట.
అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారట. పనిలో నిమగ్నం కావడం ద్వారా వేధించే ఆలోచనల నుండి బయటపడొచ్చని మీనా భావిస్తున్నారట. కాగా మోహన్ లాల్ హీరోగా దృశ్యం 3 తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మీనా నటించనున్నారని సమాచారం. దృశ్యం 1, దృశ్యం 2 సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల్లో మీనానే మోహన్ లాల్ భార్య రోల్ చేశారు. అలాగే ఆ రెండు చిత్రాలు తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయగా… మీనానే కొనసాగించారు.
కాగా ఇటీవల మీనా రెండో వివాహం చేసుకోనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. మీనా తండ్రి ఆంధ్రుడు కాగా తల్లిది కేరళ. 1982లో విడుదలైన తమిళ మూవీ నేన్ జంగల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా వెండితెరకు పరిచయం అయ్యారు. బాలనటిగా మీనా ఇరవైకి పైగా చిత్రాలు చేశారు. 1990లో విడుదలైన నవయుగం మూవీతో హీరోయిన్ గా మారారు. సుదీర్ఘ కెరీర్లో మీనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కమల్, రజినీకాంత్ తో పాటు పలువురు సౌత్ ఇండియా స్టార్స్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.