రోజురోజుకూ పంజాబ్ లో కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో వేల సంఖ్యలో జనం రాలిపోతున్నారు. దాంతో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ నియమాలను అక్కడి ప్రజలు కూడా అర్ధం చేసుకుని అందుకు తగినట్టుగానే తమ పనులను సర్దుకుంటున్నారు.
కానీ సినిమా హీరోలు ఎక్కడైనా హీరోలే కదా. పైన నుండి ఊడిపడినట్టు.. తమకు ప్రభుత్వాల ఆదేశాలతో పని లేదనట్టు, తమను ఎవ్వరూ ఏమి చేయలేరు అన్నట్టు ఫీల్ అవుతుంటారు హీరోలు. వాళ్ళు కనబడగానే జనం కూడా ఎగపడుతూ ఉంటారు కాబట్టి, పోలీసులు కూడా ఏమి చేయలేక సినీ ప్రముఖుల విషయంలో చూసి చూడనట్టు పోయేవాళ్లు ఇన్నాళ్లు. కానీ కరోనాకి అందరూ ఒక్కటే కదా, హీరో అయినా అఫీస్ బాయ్ అయినా కరోనా వదలదు.
అందుకే హీరోగారు తమ కాలనీలో షూటింగ్ చేసుకుంటున్నాడు అని తెలిసినా… జనం వెళ్లకుండా పోలీసులకు ఫిర్యాదు చేసారు. కట్ చేస్తే కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ నటుడు జిమ్మీ షెర్గిల్ పై లుధియానా పోలీసులు అరెస్ట్ చేసారనే వార్త సోషల్ మీడియాలో నిముషాల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. ఇప్పటికే నటుడు జిమ్మీ షెర్గిల్ పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయింది.
అరెస్ట్ వెనుక అసలు కారణం ఏమిటంటే.. పంజాబ్‌లోని లూధియానాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యువర్ హానర్ 2 అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో జిమ్మీ షెర్గిల్ పాల్గొని కరోనా నిబంధనలు గాలికి వదిలేశాడు. పైగా అక్కడికి వచ్చి కరోనా నిబంధనలను గుర్తు చేసిన స్థానికులను అడ్డమైన తిట్లు తిట్టాడు. సినీ ప్రముఖుడు కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోరేమో అనుకున్నాడేమో. షాట్ కట్ చేసేలోపే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలులో పడేశారు.
కర్ఫ్యూ అమలులో ఉన్నప్పడు నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. దాంతో పోలీసులు కూడా ఎవర్ని వదిలిపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కరోనా నిబంధనలు ఉల్లంగించినందుకు గానూ నటుడు జిమ్మితో పాటు అక్కడ ఉన్న వారిందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.