
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య శాఖలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం. ఏడు మెడికల్ కళాశాలల్లో 2,135 ఉద్యోగ్ ఖాళీలు 15 నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మిగతా ప్రాంతాల్లో 13 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాలల్లో మొత్తం 33 విభాగాలకు పలు రకాల పోస్టులను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగాలలో స్టోర్ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనో టైపిస్టులు, రికార్డు క్లర్క్‌లు, రికార్డు అసిస్టెంట్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్లు, కార్పెంటర్లు, అటెండర్లు, వార్డు బాయ్స్, డ్రైవర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు ఉద్యోగాల భర్తీ జరగనుంది.
నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా ఈ కళాశాలల్లో టైపిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), అటెండర్లు, హౌజ్‌కీపింగ్, శానిటేషన్ సిబ్బంది, కుక్ లు, కిచెన్ బాయ్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనం ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పోస్టులు మనుగడలో ఉంటాయని సమాచారం.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.