తెలుగు సినీ చరిత్రలో ఆయన స్థానం ఒక ఎవరెస్ట్. అనితర సాధ్యమైన ఆ స్థాయిని అకుంఠిత దీక్షతో అందుకున్నారు. అంతకు మించిన సంకల్పంతో నిలబెట్టుకున్నారు. ‘స్వయం కృషి’తో ఒక్కో మెట్టు ఎక్కారు. టాలీవుడ్ లో మకుఠం లేని మహారాజులా వెలుగొందుతున్నారు. ఆయనే.. మెగాస్టార్ చిరంజీవి. తన భవిష్యత్ కు తానే ‘పునాది రాళ్లు’ వేసుకొని.. తిరుగులేని స్థానాన్ని నిర్మించుకున్నారు. ఆరు పదుల వయసులోనూ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఆగస్టు 22 ఆయన పుట్టిన రోజు. ఇప్పటికి మెగాస్టార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 42 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిద్దాం..
‘‘అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ అంటాడు త్రివిక్రమ్. ఇది వంద శాతం నిజం. 42 సంవత్సరాల క్రితం పునాది రాళ్లు చిత్రంలో తొలి అవకాశం వచ్చినప్పుడూ.. మొదటి సినిమాగా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైనప్పుడు.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ చిరంజీవిగా మారుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతాడని ఎవ్వరూ పసిగట్టి ఉండరు. కానీ.. సినిమా పట్ల ఉన్న పిచ్చి ప్రేమ, నటన పట్ల ఉన్న ఆరాధనే ఆయన్ను ఈ స్థాయికి చేర్చాయి.
చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగు పెట్టే సమయానికే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ మహామహులుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిని తట్టుకొని, ముందుకు సాగారు చిరంజీవి. ఈ ప్రయాణంలో కష్టపడే తత్వంతోపాటు అప్పటి వరకూ ఇండస్ట్రీలో అంతంత మాత్రంగా ఉన్న రెండు విభాగాలకు ప్రాణం పోశారు చిరు. అందులో ఒకటి డ్యాన్స్ కాగా.. రెండోది ఫైట్స్. చిరంజీవి వచ్చే వరకూ నేలను, ఆకాశాన్ని చూపిస్తూ.. వేసే స్టెప్పులే డ్యాన్సులుగా ఉండేవి. కానీ.. వాటిని తనదైన బ్రేక్ డ్యాన్స్ తో.. బ్రేక్ చేసి పడేశాడు మెగాస్టార్. ఇవాళ హీరో అంటే.. ఖచ్చితంగా డ్యాన్స్ లో ఆరితేరిన వాడై ఉండాలని అందరూ కోరుకుంటున్నారంటే.. అది కేవలం చిరంజీవి కారణంగానే. ఆయన బ్రేక్, అందులోని గ్రేస్ మరెవ్వరికీ సాధ్యం కాదంటే.. అతిశయోక్తి కాదేమో.
ఇక, ఫైట్ లోనూ సరికొత్త స్టంట్స్ చిరంజీవితోనే మొదలయ్యాయి. అప్పటి వరకూ డిష్యూం.. డిష్యూం.. అంటూ సాగే ఫైట్స్ స్థానంలో సరికొత్త స్టంట్స్ కంపోజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది మాస్టర్లకు. ఆ విధంగా.. అప్పటి వరకూ చూడని ప్రొఫెషనల్ ఫైట్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యాయి. ఈ విధంగా.. ఇండస్ట్రీలో చిరంజీవిని మగ మహారాజును చేయడంలో ఈ రెండూ ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఇక, నటనలోనూ చిరుకు వంక పెట్టాల్సింది లేదు. నవరసాలను అలవోకగా, అద్భుతంగా పలికించగల సత్తా మెగాస్టార్ సొంతం. అన్ని రసాలు అందరూ పలికించగలిగనప్పటికీ.. హాస్యం, శృంగారం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వాటిని చిరు పలికించిన తీరు అమోఘం. మరీ ముఖ్యంగా కామెడీలో చిరును కొట్టే హీరో ఇప్పటికీ లేరంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కానే కాదు.
ఆయన ప్రతిభకు అదృష్టం కూడా తోడైందని చెప్పుకోవాలి. చిరును అల్టిమేట్ మాస్ హీరోగా నిలబెట్టి, ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన ఖైదీ చిత్రం.. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సింది. ఆయన షెడ్యూల్ వల్ల కుదరకపోవడంతో.. అది చిరు చెంతకు చేరింది. అది సాధించిన విజయం.. ఆయన్ను మెగాస్టార్ ను చేసిందనే చెప్పాలి. ఆ విధంగా.. ఎన్నో మైలురాళ్లు అందుకుంటూ.. ఎప్పటికప్పుడు తనను తాను మరింతగా మెరుగు పరచుకుంటూ ముందుకు సాగారు చిరు. ఆ విధంగా.. దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు.
ఆయన రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆ స్థానం అలాగే ఉంది. తిరిగొచ్చిన తర్వాత రూలింగ్ స్టార్ట్ అయ్యిందంటూ కింగ్ నాగార్జున లాంటి వాళ్లు అనడమే ఆయన స్టామినాకు నిదర్శనం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. ఈ స్థాయికి ఎదిగిన చిరు.. ఏ అండా లేకుండా.. పరిశ్రమంలో ఎవరూ కనీస పరిచయం లేకుండా అడుగు పెట్టి, ఇదంతా సాధించారు.
అయితే.. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఒక స్థాయి దాటిన తర్వాత ఏ నటుడైనా రిలాక్స్ అవుతారు. షాట్ రెడీ అంటే వచ్చేసి, ఫినిష్ చేసి వెళ్లి కార్ వ్యాన్ లో రిలాక్స్ అవుతుంటారు. కానీ.. అలా చేస్తే మెగాస్టార్ ఎందుకు అవుతారు? 150 సినిమాలు చేసినా.. ఇప్పటికీ తాను చేసే ప్రతీ సినిమాను మొదటి సినిమాలో నటిస్తున్న హీరో మాదిరిగానే కష్టపడతారు చిరంజీవి. ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమాల్లోనూ అదేవిధంగా కష్టపడుతున్నారు చిరు. అందుకే.. మెగాస్టార్ అంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ నటుడికి ఓ రోల్ మోడల్. స్వయం కృషికి ప్రత్యేక నిదర్శనం. ఎదగాలని కోరుకునే ప్రతిఒక్కరికీ ఆయన నట జీవితం ఎక్కడా దొరకని ప్రత్యేక డిక్షనరీ. ఇలాంటి మెగాస్టార్.. నిండు నూరేళ్లు హాయిగా జీవిస్తూ.. ఎందరికో స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ.. ‘‘అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే చిరు.’’