Homeఎడ్యుకేషన్Employees: ఊ అంటావా ఉద్యోగి, ఊఊ అంటావా?

Employees: ఊ అంటావా ఉద్యోగి, ఊఊ అంటావా?

Employees: ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఒక భాగమే కాదు.. కీలక భాగం. ఉద్యోగులు, బడాబాబులు, రాజకీయనాయకులు కలిస్తేనే ప్రభుత్వం. బడాబాబులు అంటే టాటా, అదానీ, అంబానీ వంటి పెద్ద పెట్టుబడిదారుల నుండి ప్రాజెక్టులు, రోడ్లు నిర్మించే గుత్తేదారుల వంటి వాళ్ళు తమ పనులు కావడానికి అనుకూలమైన రాజకీయ నాయకులని వాళ్ల పార్టీలని మారుస్తూ దగ్గరికి తీసుకుని అందుకు అనుగుణంగా డబ్బు వెదజల్లి, ప్రజాభిప్రాయాలు మలిచి, ఓట్లు కొని, సారా పారిస్తారు. ఎన్నికల్లో కీలకమైన విధులు నిర్వహించడమే గాక , గెలిచిన తర్వాత రాజకీయ నాయకులు బడాబాబులకు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలు అమలు పరిచేది ఉద్యోగులే కాబట్టి వాళ్లకి మంచి జీతాలు ఇస్తామని తమలో కలుపుకుంటారు. ఇలా బడాబాబులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు కలిసి ఏర్పడిన వ్యవస్థనే మనం ప్రభుత్వం అంటాం. “మేం శాశ్వితం” అని ప్రకటించే ఉద్యోగుల మాటల్లో నిజమే ఉంది. అంబానీని కాదని అదానీ రావచ్చు, కాంగ్రెస్ కాదని బీజేపీ రావచ్చు.. కానీ ఉద్యోగులు మారరు. వీరే కీలకం. కాబట్టి వీరిని ప్రభుత్వంలోని బడాబాబులు, రాజకీయ నాయకులు ప్రేమగా చూసుకుంటారు. ఒక రకంగా వీరే ప్రభుత్వం.

అంటే పాలకులు బడాబాబులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు అయినప్పుడు పాలితులు ఎవరు? ముగ్గురూ ఒకవైపున నిలబడితే మరో వైపున నిలబడేది ఎవరు? సామాన్య ప్రజలు! నిజానికి ఉద్యోగులే కాదు రాజకీయ నాయకులు, కొండొకచో బడాబాబులు కూడా సామాన్య జనం నుంచే వస్తారు. మోడీ వచ్చినట్లు, ధీరూభాయి అంబానీ వచ్చినట్లు, కొంతమంది ఉద్యోగులు కూడా కష్టమో, నష్టమో అనుభవించి, పరిస్థితులో, అవకాశాలో కలిసివచ్చి ఉద్యోగం సంపాదిస్తారు. ఒక్కోసారి జిల్లాని పాలించే కలెక్టర్ ఉద్యోగం కూడా సంపాదిస్తారు.

సమస్యంతా ఇక్కడే. ఒక్కసారి అధికారం రుచిమరిగాక మనిషి రక్తం మరిగిన బెబ్బులిలాగా మారిపోతారు. విభజించి పాలించే రాజకీయ నాయకుడిలాగా, దేశాన్ని దోచి ప్రపంచంలోని ధనవంతుల లిస్టులో చోటు సంపాదించే బడాబాబులాగా, ఉద్యోగి కూడా మారిపోతాడు. తాను తన సామాన్య జనం నుండి అసామాన్య వర్గంలోకి చేరుతాడు ఉద్యోగం రాగానే. పాలితుల నుండి గాకుండా పాలకుల ఆలోచనలోకి మారిపోతాడు. తాను నడిసొచ్చిన పల్లెదారి మర్చిపోతాడు, అవమానంలో నిలబడిన తన కులాన్ని, అసహాయతలో నిలిచిన మతాన్ని వదిలేస్తాడు. తన చూట్టూ వున్న సమాజాన్ని వదిలేయడమే గాక వాటిని సంస్కరించాలనే ఒకప్పటి కనీస అదర్శాన్ని ఇప్పుడు ఈసడించుకోవడం మొదలెడతాడు. పేదలు, నిరక్ష్యరాస్యులు, రోగులు, నిరుద్యోగులు, కిందికులాలను చూస్తే అసహ్యం మొదలవుతుంది.

ఇందుకు విరుద్దంగా కొత్త స్నేహితులు సంపాదిస్తాడు. వాళ్లంతా సాటి ఉద్యోగులై వుంటారు. కిందివాళ్లను ఎలా అదుపులో పెట్టాలి, పైవాళ్లను ఎలా కాకా పట్టాలి, ఎట్లా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, తన కుటుంబం కన్నా పై స్థాయిలో పెళ్ళి, పిళ్లలు, వాళ్ల చదువులు.. పాత ప్రపంచాన్ని మూసి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అందాకా తాను తన సర్టిఫికెట్ల మీద గజెటెడ్ అట్టెస్టేషన్ కోసం నిలబడిన అఫీసుల ముందు తానిప్పుడు “ఇక్కడ అటెస్టేషన్ చేయబడదు” అని బోర్డులు పెట్టిస్తాడు. తన ఆఫీసుని దివ్యమందిరంగా మార్చి చెప్పులు వదిలితేనే లోపలికి రానిస్తాడు.

కుదిరితే సొంత ఉద్యోగంలోనే లంచం, కుదరకపోతే ఉద్యోగం బయట వ్యాపారం. ఈ రెండూ చేతగాని వాళ్లు సంపాదన లేనప్పుడు పనెందుకు నేర్చుకోవాలి? చేయాలి? అనే ప్రతీకారంతో జనానికి పనిచేయకుండా నాశనం చేస్తారు. సమాజపు తిండితిని, భాష నేర్చి, బ్రతుకు దిద్దుకున్న ఉద్యోగవర్గం ఇప్పుడు అదే సమాజంతో వేరుపడిపోయింది. సంపాదనలో బడాబాబులతో పోటీ పడి వాటా పంచమంటోంది. ఉద్యోగవర్గంతో పోటీపడి దౌర్జన్యం చేయడంలో వాటా అడుగుతోంది. ఈ పోరాటాన్ని సమాజపు పోరాటంగా చూపిస్తూ సామాన్య జనాన్ని కలిసి రమ్మని నిలదీస్తోంది. నేనిక్కడ సౌకర్యాలు, విలాసాలు అడుగుతోంటే నీకు అమ్మవొడి, నాన్న భుజం, అక్క చేయూత, అన్న తోడ్పాటు అనే కనీస అవసరాల పధకాలు నీకెందుకు? అని బొబ్బరిస్తోంది. సమాజంతో వస్తుసేవలని నేనే నిర్మిస్తున్నాని, పన్నులు నేనే కట్టి జాతిని నిలబెడుతునానని బొంకుతోంది. నువ్వూ నేనూ ఒకటి కాదంటోంది.

నేలనుండి రైతుకూలీని తొలగిస్తూ సరిహద్దులో సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తున్నప్పుడు, ఫలానా మతస్తులు దేశపౌరులు కాబోరని ప్రకటించగానే అభధ్రతతో వాళ్లు గజగజ వొణికిపోయినప్పుడు, అడుగడుగునా ఇప్పటికీ అంటరానితనాన్ని అనుభవించడాన్ని చూసినప్పుడు, ఉద్యోగాలు ఉపాధులు దొరక్క రోడ్లమీద కిలోమీటర్లు నడిచినప్పుడు, నిరుద్యోగంతో యువత ఉరిపోసుకుంటున్నప్పుడు, ఒక జెండర్లో పుట్టడమే పాపంగా పరిగణించి చెరిచి చంపేస్తున్నప్పుడు, తినే తిండి దొంగలించినందుకు చెట్టుకు కొట్టేసి చావమోది చంపేసినప్పుడు.. ఇంకా చాలసార్లు చలించని ఈ ఉద్యోగుల్లో రైతుకొడుకు, కూలీ కూతురు, ఒక మైనారిటీ, ఒక కిందికులస్తుడు, ఒక వ్యాపారి కొడుకు, ఒక చేతివృత్తుల వారసుడిలో ఎందుకు స్పందన లేదు. బడాబాబులు, రాజకీయ నాయకులతో పాటు సంపాదనలో వాటా హక్కుగా మాట్లాడే నీలో బాధ్యత ఎక్కడ? మాలోని మనిషివి, మాతరపున మాట్లాడాల్సిన మనిషివి మా మీద నుండి పోగేసిన సంపాదనలో వాటాకోసం పోరాటంలో మేమెందుకు మద్దతు పలకాలి?

అదే మద్దతుగా ఈ చదువుకున్న, ప్రభుత్వంలోని ఉద్యోగులు సామాన్య్ల పట్ల నిలబడి వుంటే ఇంతటి అవిద్య వుండేదా? ఈ నిరుద్యోగం, ఈ పేదరికం, ఈ ఆర్థీక అసమానతలు, ఈ కులమత వైషమ్యాలు, ఈ జెండర్ అవమాననాలు, ఈ అవినీతి, ఈ దోపిడీ, మోసాలూ, దౌర్జన్యాలు వుండేవా? దాదాపు శతాబ్దకాలపు స్వతంత్ర దేశంలోని ఉద్యోగ వర్గం తన కోసం తప్ప ఎన్నడైనా జాతికోసం మాట్లాడిందా? పోనీ మాట్లాడుతుందన్న నమ్మకం వుందా?

“పేదల కష్టమ్మీద చదువుకుని వాళ్లని పట్టించుకోని ప్రతి చదువుకున్నవాడిని ద్రోహిగా నిలబెడతాను” అంటాడు వివేకానందుడు. ఇది ద్రోహులని లెక్కించేకాలం. నీ జీతం పెరగడానికి మద్దతులో శషభిషలు లేవు, కానీ ఆ పెంచాల్సిన జీతం మా జీవితం తగ్గించుకుని ఇస్తున్నామని నువ్వు గుర్తించకపోవడంలోనే దుఖ్ఖమంతా.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version