Parvathipuram Manyam: నలుగురి పిల్లలతో హాయిగా గడిచిపోతున్న జీవితం. ఆ పచ్చని కుటుంబం పై విధికి కన్ను కుట్టింది ఏమో.. నిప్పుల కుంపటి రూపంలో మృత్యువు వెంటాడింది. నిప్పుల కుంపటి అంటుకొని ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో వెలుగు చూసిన దారుణం ఇది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
* పార్వతీపురం మన్యంలో..
జియమ్మవలస మండలం వనజ గ్రామానికి చెందిన మేనక మధు భవన నిర్మాణ కార్మికుడు. అతనికి గ్రామానికి చెందిన సత్యవతితో 16 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి ఇంటి పెరటిలో కంచె వేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు గ్రామంలోని బంధువులతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. నిద్రకు ఉపక్రమించే క్రమంలో ఇంట్లో ఓ మూలన నిప్పుల కుంపటి పెట్టుకున్నారు. అయితే ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పనులకు ఉపక్రమించేవారు. అటువంటిది శుక్రవారం పొద్దెక్కినా ఎవరూ కనిపించకపోయేసరికి.. మధు సోదరుడు ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్న స్పందన లేదు. దీంతో ఏమైందో నాన్న అనుమానంతో తలుపులు పగల కొట్టి లోపల చూడగా.. రెండు మంచాలపై వారంతా అచేతనంగా కనిపించారు.
* కార్బన్ మోనాక్సైడ్ పీల్చి..
అయితే రెండు మంచాల పై ఉన్న ఆ నలుగురు కనీసం కదలడం లేదు. వెంటనే స్థానికులు చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మధు, సత్యవతి దంపతులతో పాటు కుమారుడు మోస్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమార్తె అయోషాకు ఊపిరి అందుకోవడం ఇబ్బందికరంగా మారడంతో విశాఖ కేజిహెచ్ పంపించారు. అయితే వారి మరణం ఎవరికీ అంతు పట్టలేదు. ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టి విడిచిపెట్టడం.. తలుపులతోపాటు కిటికీలు మూసివేయడంతో కార్బన్ మోనాక్సైడ్ వెలువడిందని.. దానిని పీల్చి మృత్యువాత చెందారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో అనుమానించదగ్గ ఆధారాలు ఏవి లభించలేదు. తలుపులు తెరిచేసరికి ఇల్లంతా దట్టమైన పొగ ఉండడంతో కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే నిర్ధారణకు వచ్చారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ.. ఆర్థిక ఇబ్బందులు కానీ.. ఆత్మ హత్య చేసుకోవాల్సిన అవసరం కానీ లేదని బంధువులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ముగ్గురు ఆడపిల్లలు అనాధలుగా మారారు. స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంత్యక్రియలకు గాను 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.