Ibomma Operator Imaddi Ravi Arrested: తెలంగాణ పోలీసులు చెప్పినట్టుగానే చేశారు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన ఐ బొమ్మ మూలలను తవ్వే ప్రయత్నం చేశారు. అత్యంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ ద్వారా ఐ బొమ్మ వెనుక ఉన్న కీలక వ్యక్తులను బయటికి తీసుకొచ్చారు. సినిమాల పైరసీకి పాల్పడి.. వీడియోలను వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తున్న ఐ బొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. చెప్పినట్టుగానే తెలంగాణ పోలీసులు ఆ పని చేశారు.
సెప్టెంబర్ 29న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ బొమ్మ వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. అంతేకాదు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్వేర్ ద్వారా ఐ బొమ్మ అసలు బాగోతాన్ని బయటపెట్టామని వెల్లడించారు. అయితే తాము ఇక్కడితోనే ఆగిపోవడం లేదని.. ఐ బొమ్మ అసలు నిర్వాహకుడిని పట్టుకుంటామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే కొద్ది నెలలుగా తెలంగాణ పోలీసులు కీలకమైన అడుగులు వేస్తున్నారు. విస్తృతమైన సమాచారాన్ని సేకరించి.. చివరికి విజయం సాధించారు..
వాస్తవానికి కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఐ బొమ్మ ఒక చీడపురుగులాగా మారింది. తెలుగు చిత్రాలను రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఐ బొమ్మ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతోంది. ఫలితంగా సినిమాలకు సంబంధించి కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఫలితంగా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.. అనుకున్న స్థాయి ఆదాయం లేకపోవడంతో చిత్ర పరిశ్రమ వేగంగా ఎదగలేక పోతోంది. చిత్ర పరిశ్రమ ఈ పైరసీ కట్టడికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐ బొమ్మ నిర్వాహకుల ఆట కట్టించడానికి తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టారు.
ఐ బొమ్మను నిర్వహిస్తున్న వ్యక్తి పేరు ఇమ్మడి రవి. ఇతడు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఇక్కడి నుంచి ఐ బొమ్మను నిర్వహిస్తున్నాడు.. ఇతడికి వివాహం జరిగింది. అయితే భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నాడు. సరిగ్గా ఫ్రాన్స్ నుంచి నిన్న ఇండియాకు వచ్చాడు రవి. కొంతకాలంగా అతని మీద నిఘా పెట్టిన సిసిఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకు అతడు రావడంతోనే వెంటనే అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఉండగా.. వాటిని సీజ్ చేశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా ఐ బొమ్మ అభిమానులు షాక్ కు గురయ్యారు. ఐ బొమ్మ ప్రధాన నిర్వాహకుడిగా రవి ఉన్నాడు. అయితే దానికి సంబంధించిన సాంకేతిక పరికరాలను.. ఇతర డివైస్ లను స్వాధీనం తీసుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఈ పరిణామంతో చిత్ర పరిశ్రమ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు.