
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అన్ లాక్, అన్ లాక్ కు నిబంధనలు సడలించే కొద్దీ నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే ప్రజల్లో భయాందోళన తగ్గినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా ప్రమాదమే అని వైద్యులు చెబుతున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలని కీలక సూచనలు చేస్తున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మిలియన్ మార్కుకు చేరుకుంది. 70,000కు పైగా నమోదవుతున్న కేసులు ఇప్పట్లో వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేయడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు కరోనాను కట్టడి చేయగలిగే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే లోపు ఇతర వ్యాక్సిన్ ఏదైనా కరోనా వైరస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..? అనే దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.
ఫ్లూ, క్షయ వ్యాక్సిన్లను ఇస్తే వైరస్ ప్రమాదాన్ని సులభంగా తగ్గించడం సాధ్యమవుతుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీని శరీరంలో పెంపొందిస్తుందని.. అందువల్ల ఫ్లూ వ్యాక్సిన్ ను వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని.. ఆ యాంటీబాడీలు సులువుగా కరోనాను కట్టడి చేయగలవని తెలుపుతున్నారు.
వైద్య నిపుణులు సైతం ఫ్లూ వ్యాధికి కరోనాకు చాలా పోలికలు ఉన్నాయని.. శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఫ్లూ, కరోనా పనితీరు ఒకే విధంగా ఉంటుందని.. ఫ్లూ వ్యాక్సిన్ కరోనా వల్ల వచ్చే ఫ్లూ లక్షణాల నుంచి కాపాడినా కరోనాను సులభంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని తెలుపుతున్నారు. ఇటలీ శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న దేశాలలో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు పేర్కొన్నారు.