భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమానికి అంతే లేకుండా పోతోంది. నిత్యం 4 లక్షల కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. దీంతో.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు గడుపుతున్నారు. అయితే.. ఇప్పుడు కొన్ని గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటు కుటుంబానికి, అటు దేశానికి కీలకమైన యువతను మింగేస్తోంది కరోనా. సెకండ్ వేవ్ లో సంభవిస్తున్న మరణాల్లో.. యువత మెజారిటీగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.
ప్రపంచంలో ఎక్కడా లేని యువశక్తి భారత్ లో ఉందని ప్రభుత్వ నేతలు ఘనంగా ప్రకటిస్తుంటారు. అది వాస్తవం కూడా. మరి అలాంటి యువతను కరోనా వారిని కబళిస్తుంటే.. ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇది ఎంత దూరం వెళ్తుందన్నది కూడా అర్థం కాని పరిస్థితి. సెకండ్ వేవ్ ప్రళయం కొనసాగుతుండగానే.. థర్డ్ వేవ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన వ్యాక్సిన్ ఇప్పటికీ.. సగం మందికి కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచంలో ముందుగా వ్యాక్సిన్ తయారు చేసింది మేమే అంటూ ఘనంగా ప్రకటించుకున్నాం. చప్పట్లు కొట్టించుకున్నాం. కానీ.. క్షేత్రస్థాయిలో ఎంత మందికి అందించాం? అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. తొలుత 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ అన్నారు. కానీ.. వ్యాక్సిన్ మాత్రం అందరికీ అందట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
దేశంలో ఇప్పటి వరకు 20 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ అందలేదని వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో.. చాలా మంది యువత మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు యువతే ఆధారం అన్నది తెలియనిది కాదు. ఈ కొవిడ్ మహమ్మారి కారణంగా యువకులు ప్రాణాలు కోల్పోతుంటే.. వారిపై ఆధారపడ్డ వారు దిక్కులేనివారిగా మిగిలిపోతున్నారు.
చూస్తుండగానే ఎంతో మంది యువకులు, మధ్యవయస్కుల వారు కుటుంబాలను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. వ్యాక్సిన్ సకాలంలో అందరికీ అందిస్తే.. ఈ మారణహోమం కొనసాగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. యువత తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. మరి, దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు ఇకనైనా చర్యలు తీసుకుంటాయా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.