
భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ సోకితే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. యువత, మధ్య వయస్కులకు ఎక్కువగా కరోనా సోకుతుండగా చిన్నారులు కూడా తక్కువగానే వైరస్ బారిన పడుతున్నారు. చాలామంది పిల్లలకు కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు.
కానీ కరోనా సోకిన రోగుల్లో వైద్యులు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేషన్ సిండ్రోమ్ సమస్యను డాక్టర్లు గుర్తించారు. ఈ సమస్య ఉండే వారిలో చర్మం లేదా కళ్లలో మంట, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, మెదడు, గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఎక్కువగా స్పందిస్తే ఈ విధంగా జరుగుతుంది. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎంఐఎస్-సికి చికిత్స అందించిన చిన్నారులను పరీక్షిస్తే వారికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది.
ఈ సిండ్రోమ్ బారిన పడిన చిన్నారులలో ఒకటి కంటే ఎక్కువ రోజులు జ్వరం, డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబారడం, చర్మంపై దద్దుర్లు, నాలుక, పెదాలు ఎర్రగా మారటం, అసాధరణంగా అలసట ఉండటం, పాదాలు లేదా చేతులు ఎర్రబారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కడుపునొప్పి, ముఖం నీలి రంగులోకి మారడం, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర సమస్యలు వీరిలో కనిపిస్తాయి. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.