TVS iQube : భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది టీవీఎస్ మోటార్ కంపెనీ. ప్రస్తుతం ఆ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ అమ్మకాల రికార్డును సాధించింది. ఇప్పటికే 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయిన ఈ స్కూటర్ గత 13 నెలల్లోనే 3 లక్షల యూనిట్లను విక్రయించి మిగతా కంపెనీలను ఆశ్చర్యపరిచింది.వరుసగా రెండు నెలలుగా భారతదేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా నిలిచిన ఈ మోడల్ ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది.
టీవీఎస్ మోటార్ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్, దేశంలో 6 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2025 చివరి నాటికి 6 లక్షల మార్కుకు చేరుకోవడానికి కేవలం 1,345 యూనిట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఇది మే 2025 మొదటి రెండు రోజుల్లోనే తీరిపోయింది. మే నెలలోని ఈ రెండు రోజుల్లోనే 27,642 యూనిట్లు అమ్ముడవగా.. అమ్మకాల మొత్తం సంఖ్య 6,26,297 యూనిట్లకు చేరుకుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి లక్ష యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికి మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే, లక్ష నుండి 2 లక్షల యూనిట్ల మైలురాయిని కేవలం 10 నెలల్లోనే చేరుకుంది. 3 లక్షల యూనిట్ల మార్కు ఏప్రిల్ 2024 ప్రారంభంలో దాటింది. అంటే లాంచ్ అయిన 52 నెలల తర్వాత. కానీ, చివరి 3 లక్షల యూనిట్లను కేవలం 13 నెలల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్‌లకు చేరవేశారు.
ఐక్యూబ్‌ను జనవరి 2020లో లాంచ్ చేశారు. దీనిలో ఫుల్ ఎల్‌ఈడీ లైట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ, విశాలమైన సీటు, మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి, దీనిని ఒక ఫ్యామిలీ ఈ-స్కూటర్‌గా ప్రచారం చేశారు. 6 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకున్న భారతదేశంలో ఇది మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మైలురాయిని చేరుకోవడానికి మొత్తం 65 నెలలు పట్టింది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో దీని డిమాండ్ వేగంగా పెరిగింది.
2025 సంవత్సరంలో టీవీఎస్ కంపెనీ మొత్తం 18.13 లక్షల స్కూటర్లను విక్రయించింది. ఇది గతేడాది కంటే 25% ఎక్కువ. ఇందులో పెట్రోల్ స్కూటర్లు అయిన జూపిటర్, ఎన్‌టార్క్, జెస్ట్, ఎలక్ట్రిక్ ఐక్యూబ్ ఉన్నాయి. ఈ పర్ఫామెన్స్ కారణంగా టీవీఎస్ 26శాతం మార్కెట్ వాటాను సాధించింది .ఐక్యూబ్ విజయం టీవీఎస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ స్కూటర్ ఇండోనేషియా మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తోంది.