
కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే కరోనాతో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఒక బ్యాంక్ మాత్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కరోనాతో చనిపోయిన ఉద్యోగి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది.
కరోనాతో మరణించిన ఉద్యోగులకు.. వారి సీటీసీకి నాలుగు రెట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పరిహారంగా చెల్లించనుండటం గమనార్హం. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి విద్యానాధన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ఇప్పటికే హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బైక్ లోన్ తీసుకుని ఉంటే ఆ రుణాలను మాఫీ చేస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు 20 మంది బ్యాంక్ ఉద్యోగులు కరోనాతో మరణించగా వారి కుటుంబ సభ్యులు బ్యాంక్ అందించే ప్రయోజనాలను పొందడానికి అర్హులు. మరణించిన వారి భాగస్వామి బ్యాంక్‌లో జాబ్ చేయాలని భావిస్తే వారికి ఉద్యోగం కూడా అందిస్తామని విద్యానాధన్ వెల్లడించారు. బ్యాంక్ జాబ్ చేయడం ఇష్టం లేని పక్షంలో రూ.2 లక్షలు అందిస్తామని, దీని ద్వారా నైపుణ్యాలు పెంచుకొని ఇతర జాబ్ కోసం ట్రై చేయొచ్చని విద్యానాధన్ పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల చదువు కోసం ప్రతి నెలా 10,000 రూపాయలు అందిస్తామని విద్యానాధన్ వెల్లడించారు. వారి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు డబ్బులు అందుతాయని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా బ్యాంక్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.