Hyderabad Real Estate: విశ్వనగరం హైదరాబాద్‌లో కొన్ని నెలలుగా రియల్ వ్యాపారం పడిపోతోంది. భూములు, ఇళ్లు కొనేందకు చాలా మంది వెనుకాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రాతో స్థలాలు, ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొనుగోలు చేసే స్థలం, ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్‌లో ఉందా అనే విషయం తెలియక కొనుగోలు చేయకపోవడమే మంచిది అన్న భావనలో ఉన్నారు. అయితే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్‌లో ఇళ్ల ధరలు 7 శాతం పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్డ్‌గర్ తెలిపింది. దేశ వ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7 నుంచి 57 శాతం వరకు పెరిగాయని వెల్లడించింది. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో చదరపు అడుగుకు ధర రూ.7,050 మాత్రమే పెరిగినట్లు తెలిపింది. మొదటి త్రైమాసికంలో ఈ ధర కేవలం రూ.6,580 గా ఉంది.
గరిష్టంగా ఢిల్లీలో..
ఇక ప్రాప్డ్‌గర్ నివేదిక ప్రకారం.. దేశంలో అత్యధికంగా ధరల పెరుగుదల ఢిల్లీ మార్కెట్‌లో నమోదైంది. ఇక్కడ ఇళ్ల ధరలు 57 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధకి కారణంగా తెలుస్తోంది. ఆర్బీఐ గడిచిన 10 పాలసీల సమీక్షలో రెపోరేటును 6.5 శాతంగానే కొనసాగించడం ధరల పెరుగుదలపై ప్రభావం చూపింది. రేట్ల తగ్గింపు లేనికారణంగా డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపుతోందని ప్రాప్డ్‌గర్ తెలిపింది.
దేశంలో ధరల పెరుగుదల ఇలా..
– బెంగళూరులో ఇళ్ల ధరల పెరుగుదల గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరిగింది. అడుగుకు రూ.7,512 కు చేరింది.
– చెన్నై నగరంలో ఇళ్ల ధరలు 22 శాతం పెరిగాయి. చదరపు అడుగకు రూ.7,179కి పెరిగింది.
– కోల్‌కత్తాలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ధరతో పోలిస్తే 22 శాతం వృద్ధి నమోదైంది.
– ఇక ఆర్థిక రాజధాని ముంబైలో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగుకు రూ.12,590గా నమోదైంది.
– పూణెలో ఇళ్ల ధరల వృద్ధి 18 శాతంగా నమోదైంది. ఇక్కడ చదరపు అడుగుకు రూ.6,952గా ఉంది.
– గుజరాత్‌లోని అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది.