
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం జమైనట్లే ఈ సంవత్సరం రెండు విడతల నగదు ఖాతాల్లో జమ కాగా డిసెంబర్ లో జమ కావాల్సిన మూడో విడత నగదు మాత్రం జమ కాలేదు. మూడో విడత నగదు జమ కాకపోవడంతో రైతులు ఎందుకు జమ కాలేదో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు.
గతంలో పలు సందర్భాల్లో పీఎం కిసాన్ స్కీమ్ నగదు జమ ఆలస్యమైనా 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో కచ్చితంగా జమయ్యేది. అయితే ఈసారి మాత్రం ఎందుకో జమ కాలేదు. రైతులు మూడుసార్లు జమయ్యే నగదును పెట్టుబడి ఖర్చుల కోసం వినియోగించుకునే వాళ్లు. అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తుది అనుమతులు రాకపోవడం వల్లే నగదు జమ అంతకంతకూ ఆలస్యమవుతోందని వెల్లడించారు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తే వెంటనే ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. మొదట నిబంధనల మేరకు తక్కువ పొలం ఉన్నవారు మాతమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందగా ఈ ఏడాది జూన్ నుంచి కేంద్రం రైతులందరికీ ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుస్తోంది.
త్వరలో ఈ నిధుల జమకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన కూడా నగదు జమ ఆలస్యం కావడానికి కారణమని అయితే త్వరలోనే నిధులు జమవుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.