YSRCP targets Janasena: సింహం సింగిల్ గా వస్తుంది.. మీరు సింగిల్ గా రండి.. మీదీ ఒక రాజకీయ పార్టీయేనా? అసలు మీ అధినేత ఒక నాయకుడేనా? రెండు చోట్ల ఓడిపోయాడు? మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు? అసలు ఆయనకు రాజకీయం తెలుసా?.. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయారు ఏపీ ప్రజలు. అయినా సరే అదే మాటలు చెబుతున్నారు వైసీపీ నేతలు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక లాజిక్ మరిచిపోయారు. ఇప్పుడు జగన్ ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఎందువల్ల? ఎవరు కారణం? అనేది తెలుసుకోలేకపోతున్నారు. కచ్చితంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్. అది తెలుసుకొని మాట్లాడకపోతే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆ పార్టీ మరింత పతనం కావడం ఖాయం కూడా.
ఆది నుంచి మిత్రపక్షలే..
2014లో టిడిపికి( Telugu Desam Party) సపోర్ట్ చేసింది జనసేన. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించినట్టే కదా. కలిసి పోటీ చేయకపోయినా మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అదే జనసేన 2019లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు దారుణ పరాజయం ఎదురయింది. అంటే వేర్వేరుగా టిడిపి, జనసేన పోటీ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది. అప్పుడే జగన్లో బీజం పడింది టిడిపి, జనసేన కలవకూడదని. ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అస్సలు ఫలించలేదు ఆ ప్రయత్నం. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించగలిగారు జగన్. కానీ జైలుకు వెళ్లి పరామర్శించిన పవన్ ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రకటన చేశారు. ఆ తరువాత కూడా వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ముద్రగడ వంటి కాపు నేతలను రెచ్చగొట్టి జనసేనలోకి పంపించాలని చూశారు. ఆ ప్రయత్నానికి కూడా చెక్ పెట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ఇద్దరు నేతలు వాటికి పెడుతూ వస్తున్నారు.
అందుకే జనసేన టార్గెట్..
తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎలా ఉంటుందో వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి తెలుసు. అందుకే జనసేనను టార్గెట్ చేసుకున్నారు. జనసేన పార్టీ శ్రేణుల్లో ఏవేవో కొత్త ఆలోచనలను తేవాలని ప్రయత్నిస్తున్నారు. తనకు తాను మేధావిగా భావించే పేర్ని నాని సరికొత్తగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ సేనతో సేనాని పేరిట సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులను ఉద్దేశించి అందరూ సర్దుకు పోవాలి అని సూచించారు. ఆ చిన్నపాటి వ్యాఖ్యతో బహుళ అర్థాలు, అనుమానాలు, జనసేన కార్యకర్తల్లో అపోహలు సృష్టించేందుకు పలువులు చిలువలు వేసి మాట్లాడారు. నాగబాబుకి రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీతో సరిపెట్టారు. నారా లోకేష్ కోసం సర్దుకుపోవాలని చెప్పారు. నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రి పదవులు తీసుకున్నారు కదా? వద్దని సర్దుకుపోవచ్చు కదా? పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీ జండా మోయాలి.. ఇప్పుడు సర్దుకు పోవాలా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిచేందుకు పేర్ని నాని లాంటి మేధావి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు. కానీ జనసేన ని రెచ్చగొట్టేందుకు వైసిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది. అటువంటిది ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డికి.. తనకు తాను మేధావిగా భావించే పేర్ని నానికి అర్థం కాకపోవడం విశేషం.